మేడిగడ్డలో కుంగింది ఒక్క పిల్లర్.ఆ ప్రమాదంలో ఒక్క ప్రాణమూ పోలేదు.కానీ కాంగ్రెస్ పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. రిపేరు చేస్తానని నిర్మాణ సంస్థ చెప్తున్నా పెడచెవిన పెట్టారు. కుంగిన పిల్లర్‌ను చూపించి మొత్తం కాళేశ్వరాన్నే నిందించారు.ఒక్క పిల్లర్ కుంగితే గాయి చేసిన కాంగ్రెస్సే.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలితే బయటకురాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ కూలి, 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయినా పట్టనట్టే ఉంటున్నది. ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడానికి పాట్లు పడుతున్న ప్రభుత్వం.. సహాయచర్యల్లో మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఇంత జరిగినా సీఎం రేవంత్‌రెడ్డి తన పర్యటనలు ఆపలేదు.. ఎన్నికల ప్రచారాన్నీ ఆపలేదు..ప్రమాదస్థలికి వెళ్లే ప్రయత్నమూ చేయలేదు.
SLBC Tunnel Mishap | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ కుప్పకూలి.. అందులో 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకుపోయారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో? లేరో?నని.. ఎలాగైనా క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలంతా రెండు రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కూలి ఎనిమిది మంది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా.. అదేమీ పట్టనట్టు ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకొన్నారని, తూతూ మంత్రపు ప్రకటనలు, సమీక్షలు చేసి ఇతర కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ ‘అసలు రాష్ట్రంలో టన్నెల్ కూలిన ఘటన ఒకటి జరిగిందా?’ అన్న రీతిలో ముఖ్యమంత్రి ఉన్నారని రాజకీయవర్గాల్లోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన జరిగి రెండు రోజులు దాటినా..
ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి రెండు రోజులు దాటింది. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం వచ్చిన సిబ్బంది అందులో కూరుకుపోయారు. వాళ్లు ప్రాణాలతో బయటకు రావాలని ఒక్క తెలంగాణే కాదు.. టన్నెల్లో చిక్కుకున్న వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికుల కోసం ఆయా ప్రాంతాలవారు వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు. సిబ్బందిని రక్షించేందుకు ఢిల్లీ నుంచి ఆర్మీ, రెస్యూ బృందాలు వచ్చాయి. వారంతా అక్కడ కార్మికులను రక్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? సమాచారం తెలిసిన వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని రక్షణ చర్యలను పర్యవేక్షించాలి. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. టన్నెల్ కుప్పకూలి మట్టిబెడ్డలు, నీళ్లు, కాంక్రీట్ పెచ్చుల కుప్పల కింద 8 మంది ఉద్యోగులు, సిబ్బంది మరణం అంచున ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. కూలిన టన్నెల్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. బాధ్యతలను మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లిపై నెట్టేసి సీఎం రేవంత్‌రెడ్డి తనకెందుకులే అన్నట్టుగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పెద్దగా స్పందించిన దాఖలాలేవి?
ఘటన జరిగినప్పటి నుంచి దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదనే విమర్శలున్నాయి. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఘటన జరిగితే దీనిపై సీఎం రెండు, మూడు గంటల తర్వాత స్పందించారు. తక్షణ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించినట్టుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లికి బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత సీఎం తన పనుల్లో తాను నిమగ్నమైపోయారు. బీసీ నేతలతో సమావేశం నిర్వహణ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఘటనా స్థలంలో పరిస్థితి దయనీయంగా మారింది. ఎంత వరకు కూలిపోయిందో?, ఎలా కూలిపోయిందో?, అందులో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఎలాఉన్నదో? తెలియక భయానక వాతావరణం నెలకొన్నది. కానీ సీఎం మాత్రం అప్పటి వరకు ఘటనపై కనీసం సమీక్ష నిర్వహించలేదని తెలిసింది. ఆ తర్వాత ప్రధాన మంత్రి మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించడం, ఫోన్ చేసి ఆరా తీయడంతో సీఎంపై ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది. దీంతో రాత్రి సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి ఉత్తమ్, వేం నరేందర్‌రెడ్డి ద్వారా అక్కడి పరిస్థితులను సీఎం తెలుసుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో అధికారులు, మంత్రులు, ఇతర ఇంజినీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించలేదు.
హుటాహుటినహైదరాబాద్కు కోమటిరెడ్డి
‘ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడమే నా జీవిత లక్ష్యం’ అని డబ్బా కొట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇప్పుడు టన్నెల్ కూలి 8 మంది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా ఆయన పత్తాలేకుండా పోయారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా ఆయన జాడ కనిపించడం లేదు. ఎస్ఎల్బీసీ తన చిరకాల స్వప్నమని పదే పదే చెప్పుకునే ఆయన, కూలిన టన్నెల్లో 8 మంది ఇరుక్కుపోయినట్టు వస్తున్న వార్తలకు కూడా స్పందించడంలేదు. మంత్రి సొంత పనులపై విదేశాలకు వెళ్లినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. కాగా, ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లారని పలువురు.. లేదు సొంత పనులు చక్కబెట్టుకునేందుకు విదేశాలకు వెళ్లారని మరికొందరు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకోసం యంత్రాలను పరిశీలించేందుకు తానే స్వయంగా అమెరికా వెళ్లివచ్చిన సదరు మంత్రి, ఇంత పెద్ద ఘటన జరిగినా ఇంతవరకు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన విదేశీ టూర్‌పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, విమర్శలు రావడంతో మంత్రి నాలుక కరుచుకొని హైదరాబాద్ బయలుదేరుతున్నట్టు సమాచారం. ఆదివారం రాత్రికి ఇక్కడికి చేరుకొని సోమవారం ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో
తెలిపింది.
నేడు ఎన్నికల ప్రచారానికి రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పట్టభద్రులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసే ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11:30 గంటలకు మొదట నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకొని సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌కు చేరుకొని ఆ పార్టీ పట్టభద్ర ఎమ్మెల్సీ తరఫున ప్రచారం చేస్తారు.
సోషల్ మీడియాలో సెటైర్లు
‘టన్నెల్ లోపల చిక్కుకున్నవారిని బయటకు తీయడం కష్టంగా ఉన్నది.. నీటి తీవ్రత ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా కొట్టుకువచ్చింది. కిలో మీటర్ మేర నీరు, బురదనే ఉన్నయి’ అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘ఒకరేమో 50 మీటర్ల దూరంలో ఉన్నాం అంటరు.. నువ్వేమో కిలో మీటరు అంటున్నవ్.. ఏం గవర్నమెంట్ అయ్యా ఇది..’ ‘ఏం కర్మరా అయ్యా.. ఇంత చేతగాని వాళ్లను గెలిపించుకున్నం..’.. ‘కమిషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలివి’..‘ఆ పాపం మీకు తగులుద్ది.. అత్యవసర చర్యలు చేపట్టకుండా ప్రెషర్ పెట్టి పనిచేయించారు.. దాని ఫలితమే ఈ యాక్సిడెంట్’..‘తెలుగు చానళ్లు ఎక్కడ?’.. ‘ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగితే నాకు ఇప్పుడే తెలిసిందంటూ 11.30 గంటల ప్రాంతంలో స్పందించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి’..‘దాదాపు 50 మందికిపైగా సిబ్బంది, కార్మికులు చిక్కుకొని ఇంత పెద్ద ఘటన జరిగితే చీమ కుట్టినట్టు కూడా లేకుండా బీసీ నేతలతో సమావేశాలు అంటూ గడుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి’.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.