Chandrababu Naidu | హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందడమే తనకు ముఖ్యమంటూ సన్నా యి నొక్కులు నొక్కారు. అయితే, తెలంగాణపై మళ్లీ చంద్రబాబు నీడ వాలితే రాష్ట్రం అధోగతేననే తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గతంలో రెండు కండ్ల సిద్ధాంతం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే సిద్ధాంతం తెలంగాణను నాశనం చేయడం ఖాయమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ సీఎంగా గెలిచిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు.. బే గంపేట నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని తెలంగాణలో ఉనికి కోసం చేసిన బలప్రదర్శనగా చూడాలని తెలంగాణ వాదులు పేర్కొంటు న్నారు.
రెండు రాష్ర్టాల అభివృద్ధే తనకు ముఖ్యమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం పలు ప్రశ్నలు సంధిస్తున్నది. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణకు ఏ విధంగా న్యాయం చేయగలరు? పారిశ్రామికరంగంలో ఏపీకి వచ్చే పెట్టుబడులను తెలంగాణకు మళ్లీస్తారా? లేకపోతే తెలంగాణకు వచ్చే పెట్టుబడులను తన సొంత రాష్ర్టానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయరా? అని అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన పలు పరిశ్రమలను ఏపీకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇదేనా రెండు కండ్ల సిద్ధాంతం? అని ప్రశ్నిస్తున్నారు.