హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైటెక్ సిటీ తానే కొట్టానని, కంప్యూటర్లను తానే పరిచయం చేశానని, స్మార్ట్ఫోన్లు ఈ స్థాయికి వస్తాయని ముందే ఊహించానని, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీసెస్ యజమాని తండ్రిని తాను ప్రోత్సహించానని, ఆ కారణంగానే వాళ్ల కుమారుడు అభివృద్ధి చెందాడని.. ఇంకా ఇలాంటి అనేక వింత వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ..
‘నేనే క్లీన్ కోహినూర్ డైమండ్. అందుకే ఇంగ్లండ్‌లో కోహినూర్ డైమండ్ ఉన్న మ్యూజియంను సందర్శించేందుకు నాకు అనుమతి ఇవ్వలేదు’ అని చెప్పారు. అంతటితో ఆగకుండా ముకేశ్, అనిల్ అంబానీల తండ్రి, ప్రముఖ వస్ర్తాల వ్యాపారి దివంగత ధీరూభాయ్ అంబానీకి టెక్నాలజీ గురించి తానే వివరించానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రాని సమయంలో తాను వెళ్లి ధీరూభాయ్‌ని కలిశానని చెప్పారు. ‘ధీరూభాయ్ ఒక కంపెనీ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని చెప్పారు.
అప్పుడు టక్కున నేను మన రాష్ట్రంలో పెట్టాలని కోరాను. దీనికి ధీరూభాయ్.. నేను రిఫైనరీ మ్యాన్‌ను నాకు టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదని అన్నారు. అప్పుడు నేను ఆయనకు టెక్నాలజీ గురించి వివరించడంతో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు’ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల స్ఫూర్తితో ధీరూభాయ్ ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని అన్నారు. చంద్రబాబు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. వాటిపై సెటైర్లు పటాకుల్లా పేలుతున్నాయి.