కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 20 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగి కరీంనగర్ రూపురేఖలు మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తు చేశారు. సోమవారం కరీంనగర్ 32వ డివిజన్లో 45 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఏళ్ల తరబడిగా ఉన్న మట్టి రోడ్లన్నీ బీఆర్ఎస్ పాలనలో సీసీ రోడ్లుగా మారాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వడం వల్లనే పెద్ద ఎత్తున పనులు చేయగలిగామని చెప్పారు.
గతంలో సీఎం అస్యూరెన్స్ కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులన్నింటినీ పూర్తి చేసి, మరిన్ని కొత్త నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తేనే ప్రజలు హర్షిస్తారని హితవుపలికారు. నగరంలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. గతంలో తాము మొదలు పెట్టిన మానేర్ రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఇతర అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తేనే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని హర్షిస్తారని, లేకపోతే నిలదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మర్రి భావన, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, ఐలేందర్, తదితరులు పాల్గొన్నారు.