Bhatti Vikramarka | ఖమ్మం, జూలై 28: ‘మేమంతా వరదలో చిక్కుకున్నాం.. అధికారులు, పోలీసులు మమ్మల్ని దగ్గరుండి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడారు. వరద పోయినంక వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు మీరు మాతో ఫొటోలు దిగడానికి వచ్చారా?’ అంటూ ఖమ్మం నగరానికి చెందిన వరద బాధితులు.. శుక్రవారం సాయంత్రం వరద ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన సీఎల్పీ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను నిలదీశారు.
భట్టి విక్రమార్క నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, పద్మావతి నగర్, మోతినగర్ పర్యటనకు వెళ్లగా.. ప్రజలు తిరగబడ్డారు. ఏ ముఖం పెట్టుకుని వచ్చారని మండిపడ్డారు. మున్నేరు పొంగి తాము నివాసం ఉంటున్న ప్రాంతంలోకి వరద నీరు చేరిందని, నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి తమను పునరావాస కేంద్రానికి తరలించారని ఖమ్మం ముంపు బాధితుడు బొల్లెద్దు కార్తీక్ తెలిపారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతం ఏటా ముంపునకు గురవుతున్నదని, ఇంతటి వరదలను గత 20 ఏండ్లలో ఎప్పుడూ చూడలేదని ముంపు బాధితురాలు చల్లమల్ల సునీత చెప్పింది. వరద ముప్పును తెలుసుకుని వెంటనే మంత్రి అజయ్, అధికారులు తమ ప్రాంతానికి వచ్చి దగ్గరుండి తమను పునరావాస ప్రాంతాలకు తరలించారని పేర్కొన్నది.