మొగులు పగిలింది. ఆకాశం బద్దలైంది. కనీవినీ ఎరగని రీతిలో కురిసిన కుంభవృష్టి వానకు కామారెడ్డి కకావికలమైంది. భీకరవర్షాలతో వరద ముంచెత్తింది. ఉత్తర తెలంగాణ చిగురుటాకులా వణికింది. రోడ్లు కొట్టుకుపోయాయి. ఇండ్లు నీటముని గాయి. కాలనీల్లో నీళ్లు! కండ్లల్లో కన్నీళ్లు! మెదక్ నుంచి నిర్మల్ దాకా, మంజీర నుంచి మానేరు దాకా అన్నిచోట్లా అదే వరద బీభత్స దృశ్యం. ఇంత జరిగినా.. యూరియా గోస పట్టనట్టే వరద యాతన కూడా సర్కారుకు పట్టలేదు. సమస్యను వదిలేసి, సహాయ చర్యలు గాలికొదిలి.. ఇతర అంశాలపై సమీక్షలతోనే సరిపెట్టింది.
హైదరాబాద్/సిద్దిపేట/ మెదక్/నిజామాబాద్/నిర్మల్/ ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వాగులు, వంకలు పోటెత్తి.. చెరువులు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయి. కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారంలో మగ్గుతున్నాయి. భారీ వరదలకు పదిమందికిపైగా గల్లంతైనట్టు తెలిసింది.
కనీవినీ ఎరగని రీతిలో ఏకధాటి వానలతో కామారెడ్డి పట్టం కకావికలమైంది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. కాలు బయట పెట్టే పరిస్థితి లేక దాదాపుగా 40 గంటల పాటు ప్రజలు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పట్టణంలో 12 అడుగుల ఎత్తుతో వరద ప్రవహించడంతో ఎన్జీవో, జీఆర్ కాలనీలు భయానక పరిస్థితిలో కొట్టుమిట్టాడాయి. కామారెడ్డి శివారు ప్రాంతంలో పంట పొలాల మీదుగా తన్నుకు వచ్చిన వరద అంతకంతకూ పెరిగి భవనాలను ముంచెత్తుతూ ముందుకు సాగింది. కామారెడ్డి పెద్ద చెరువు ఎన్నడూ లేని విధంగా అలుగు దుంకడంతో సమీప ప్రాంతాల నివాసితులు ప్రాణభయంతో వణికిపోయారు. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకు పోయాయి. రోడ్లవెంట నిలిచి ఉంచిన లారీలు, భారీ వాహనాలు వరద ధాటికి చెల్లాచెదురయ్యాయి. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నివాసాలు బురదతో నిండిపోయాయి. రోడ్లు నామ రూపాల్లేకుండా పోయాయి. గ్రామాలు, తండాలు జలాదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భవానిపేట శివారులో ఎర్రగుంట వద్ద చెక్ డ్యామ్ కొట్టుకుపోయి గ్రామాన్ని తాకుతూ పెద్ద వాగు ప్రమాదకరంగా ప్రవహించింది. ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్ మార్గంలో చెరువు తెగి రాకపోకలు బందయ్యాయి. నాగిరెడ్డిపేట మండలం నడిమితండాలో గిరిజనులు బుధవారం వరదలో చిక్కుకొని ఆర్తనాదాలు చేశారు. కామారెడ్డి మండలం లింగాయిపల్లి శివారులో వరదలో నలుగురు, చిన్నమల్లారెడ్డి చెరువు వద్ద ముగ్గురు చిక్కుకోగా రక్షణ దళాలు కపాడాయి. కామారెడ్డి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లే మార్గంలో పాల్వంచ వాగు ఉగ్రరూపం దాల్చి రాకపోకలు నిలిచి పోయాయి. బొగ్గు గుడిసె సమీపంలో ఎన్హెచ్ పనులు చేస్తున్న 8 మంది బీహార్ కూలీలు, గున్కుల్లో కోళ్ల ఫారంలో ముగ్గురు చిక్కుకోగా రక్షణ దళాలు కాపాడాయి. రాజంపేటలో గోడ కూలి ల్యాబ్ టెక్నిషియన్ చనిపోయాడు. జిల్లా వ్యాప్తంగా 36కు పైగా చెరువులు తెగినట్టు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. మంజీరా ఉగ్రరూపం, నిజాంసాగర్ గేట్లు ఎత్తి దిగువకు లక్షన్నర క్యూసెక్కులు వదలడంతో దిగువన అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
Roads
కామారెడ్డిలో కురిసిన అత్యంత భారీ వర్షానికి ఎన్హెచ్ 44 నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచే హైవేపై వరద పెరగడంతో పోలీసులు వాహనాలను నియంత్రించారు. వెనక్కి వెళ్లలేక, ముందుకు కదల్లేక గంటల కొద్దీ వాహనదారులు నరకయాతన పడ్డారు. భిక్కనూర్ మండలం రామేశ్వరపల్లి శివారులో భిక్కనూర్ – తలమడ్ల రైల్వే స్టేషన్ మధ్య వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకు పోయింది. 10 మీటర్ల పొడవునా పట్టాలు తెగిపోవడంతో రైళ్ల పోకలను సౌత్ సెంట్రల్ రైలే నిలువరించింది. బుధవారం పలు రైళ్లను రద్దు చేయగా గురువారం నుంచి మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
నిర్మల్ పట్టణంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. జీఎన్ఆర్ కాలనీవాసులు ఇండ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కుంటాల మండలం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. నిర్మల్ పట్టణం, మండలంలో అత్యధికంగా 33 సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉప్పొంగి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే పాత జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. బాసర మండలం బిద్రెల్లి వద్ద వాగు ఉధృతికి భైంసా -నిజామాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మునిపెల్లిలో పశువుల కాపరి వాగులో చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. వరద పోటెత్తడంతో కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.
మెదక్ జిల్లాలో 40 ఏండ్లలో ఎన్నడూ పడని విధంగా బుధవారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు ఉప్పొంగాయి. జిల్లాలోని దూప్సింగ్ తండా రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. హవేళీ ఘనపూర్ మండలం రాజ్పేటకు చెందిన సత్యనారాయణ, యాదగౌడ్ ఇద్దరూ ఆటోల్లో మెదక్లో ఉన్న వాళ్ల పిల్లలను తీసుకొచ్చేందుకు బయలుదేరగా, మార్గమధ్యలో నక్కవాగు దాటుతూ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వీరిద్దరూ కరెంటు స్తంభాన్ని పట్టుకొని నాలుగు గంటల పాటు తమను కాపాడాలని వేడుకున్నారు. జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరద ఉధృతి మరింత పెరిగి కరెంటు స్తంభం కొట్టుకుపోవడంతో చనిపోయారు. నిజాంసాగర్ గేట్లు ఎత్తి వరదను వదలకపోవడంతో అనేక గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. వాడి నుంచి రాజపేట వరకు మార్గమధ్యలో రోడ్లు ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. రెండు రోజులుగా హవేళీఘన్పూర్ మండలంలో ఐదు గ్రామాలకు విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రేగోడ్ మండలం మర్పల్లిలో బండి హరికృష్ణ(22) మంగళవారం చనిపోగా బుధవారం అంత్యక్రియలకు గొల్ల వాగు దాటే వీలు లేక ఎక్స్కవేటర్, ట్రాక్టర్ సాయంతో అంత్యక్రియలు చేశారు. మెదక్-శమ్నాపూర్ వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది.
కుండపోత వర్షానికి సిద్దిపేట జిల్లా కేంద్రం చిగురుటాకులా వణికిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి.కొత్త బస్టాండ్ నుంచి మోడ్రన్ బస్టాండ్ మధ్య రోడ్డు వెంబడి బ్రిడ్జిపైన నీరు చేరి రాకపోకలు స్తంభించిపోయాయి. కోమటి చెరువు ఉధృతికి శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. సీతారామాంజనేయ థియేటర్ వద్ద రోడ్డుపై నీళ్లు చేరి ప్రజలు ఈత కొట్టుకుంటూ రోడ్డు దాటారు. చిన్ననిజాంపేటకు చెందిన రైతులు రాజు, గోపాల్, సుదర్శన్ వ్యవసాయ పనులకు వెళ్లి చెరువు ఉధృతికి చిక్కుకుపోయి రాత్రంతా అక్కడే ఉండగా గురువారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. నర్మాలలో మానేరువాగు ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు రైతులను ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రక్షించారు. వీరు బుధవారం మధ్యాహ్నం పశువులను మేపేందుకు వెళ్లి వాగులో చిక్కుకొని ఎత్తయిన గడ్డమీద ఉండిపోగా డ్రోన్ ద్వారా అధికారులు ఆహారం అందించారు.
కామారెడ్డి జిల్లాలో గడిచిన 48 గంటల్లో 65 సెం.మీ ఆల్టైమ్ రికార్డ్ వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి 49.48 సెం.మీ, గురువారం మరో 16 సెం.మీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో సగటున 60 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా రాజాంపేటలో రికార్డు స్థాయిలో 49.48 సెం.మీ, ఇదే జిల్లా నాగారెడ్డిపేటలో 33.54 సెం.మీ, కామారెడ్డిలో 33.51 సెం.మీ, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్లో 33.28, కామారెడ్డి భిక్కనూర్లో 32.98, సదాశివనగర్ 31.98, లింగంపేట 31.64, తాడ్వాయి 31.47 సెం.మీ చొప్పున నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూన్లో 20 శాతం లోటు వర్షపాతం నమోదైనా జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో ఈ సీజన్లో 25 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 130.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 104.2 మి.మీ మాత్రమే కురిసింది. జూలైలో సగటు వర్షపాతం 227.4 మి.మీకి గాను 237.9 మి.మీ కురిసింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా గురువారం నాటికే 349.6 మి.మీ నమోదైంది. ఇది సాధారణం కంటే 80 శాతం, నిరుడితో పోలిస్తే 102 శాతం అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. గనుల్లో వాహనాలు నిలిచిపోయాయి.
అల్పపీడన ప్రభావానికి తోడు ఉపరితల ఆవర్తనం, రుతుపవన ధ్రోణి ప్రభావంతో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం ఆదిలాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.శనివారం కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, భదాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.