హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖ ఈఎన్సీకి తాజాగా లేఖ రాసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం 3వ టీఎంసీ పనులకు సంబంధించిన డీపీఆర్లను సీడబ్ల్యూసీ తిప్పిపంపింది. వార్ధా ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర ఒప్పందం, ముంపునకు సంబంధించిన వివరాలు, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చేసిన నిర్మాణాల వినియోగం, ఆయకట్టు వివరాలను ఇవ్వాలని సీడబ్ల్యూసీ కోరింది.
కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించిన పలు అంశాలపై వివరణ కోరింది. ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ప్రభుత్వం వివరాలను ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల డీపీఆర్లను తిరస్కరిస్తున్నట్టట్టు సీడబ్ల్యూసీ ఆ లేఖలో వెల్లడించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించిన జలాలపై న్యాయవివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దానిని సైతం తిరస్కరిస్తున్నట్టు సీడబ్ల్యూసీ లేఖలో స్పష్టం చేసింది.