హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌లో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. కొంత మంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని, ఒక మహిళ ఫోర్జరీ సంతకాలతో సంఘాన్ని ఆమె చేతుల్లో తీసుకుందని సంఘం అధ్యక్షుడు సాయిలు ఆరోపణలు చేశారు. కోదాడకు చెందిన శృతి అనే మహిళ..విశాఖపట్నంలో నివసిస్తూ తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘంలో అక్రమాలకు పాల్పడుతున్నారని సాయిలు విమర్శించారు.
నకిలీ అసోసియేషన్ ఏర్పాటు చేసి అందులో కొంతమంది సన్నిహితులను చేర్చుకుని టోర్నీల పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో అడ్హాక్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, హన్మంత్రాజ్తో పాటు సాట్స్ డీడీ సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి కమిటీ ఏర్పాటు చేశారని సాయిలు ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటి క్రీడా మంత్రి శ్రీహరికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.