ముల్లాన్‌పూర్: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి పోరులో ఓడిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును 102 పరుగుల తేడాతో ఓడించి రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సిరీస్ (1-1) ఆశలను సజీవంగా ఉంచుకుంది. వన్డేలలో ఆస్ట్రేలియాకు పరుగులపరంగా ఇదే అతిపెద్ద (ఇంతకుముందు ఇంగ్లండ్‌పై 92 రన్స్ తేడాతో) పరాభవం. మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 49.5 ఓవర్లలో 292 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (91 బంతుల్లో 117, 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈ ఫార్మాట్లో 12వ శతకాన్ని పూర్తిచేసింది. 77 బంతుల్లోనే ఆమె శతకం పూర్తయింది.
దీప్తి శర్మ (40) రాణించింది. అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 40.5 ఓవర్లలో 190 రన్స్‌కే చేతులెత్తేసింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ (3/28) నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కంగారెత్తించగా బ్యాట్‌తో మెరిసిన దీప్తి బంతి (2/24)తోనూ మాయ చేసింది. రేణుకా, స్నేహ్ రాణా, అరుంధతి, రాధా యాదవ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా వన్డేల్లో ఆస్ట్రేలియాపై స్వదేశంలో 18 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ఇదే మొదటి విజయం. చివరిసారి 2007లో చెపాక్ (చెన్నై) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా 13 వన్డేల జైత్రయాత్రకు బ్రేక్ పడినైట్టెంది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఈనెల 20న ఢిల్లీలో జరుగుతుంది.