తాండూర్, సెప్టెంబర్ 17: యూరియా కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం గోపాల్రావుపేటలో బుధవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలరావుపేటకు చెందిన పోగుల మల్లేశ్, నానక్క దంపతులు యూరియా దొరకక ఇబ్బంది పడుతున్నారు. బుధవారం రేచిని గ్రామంలో యూరియా పంపిణీ చేస్తున్నారని మల్లేశ్ లైన్లో నిల్చున్నాడు.
ఒక్కొక్కరికీ ఒకే బస్తా ఇస్తుండడంతో యూరియా కోసం లైన్ నిల్చోవడానికి రావాలని భార్య నానక్కకు ఫోన్ చేసి చెప్పాడు. గ్రామానికి చెందిన ఫీట్ల మారుతీ బైక్‌పై నానక రేచినికి వస్తుండగా ఎదురుగా వచ్చిన సూల్ బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మారుతికి కాలు విరగగా, నానకకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నానక్కను కరీంనగర్‌కు తరలిస్తుండగా మృతి చెందింది.