వనపర్తి: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్ మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా (Wanaparthy) గోపాలపేట ఎస్సీ హాస్టల్లో ఉంటూ 8వ తగతి చదువుతున్న భరత్ అనే విద్యార్థికి మూర్ఛ వచ్చింది. దీంతో హాస్టల్ సిబ్బంది వనపర్తిలోని ఎంసీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. అతని స్వస్తలం గోపాలపేట మండలంలోని ఏదుట్ల గ్రామం. దీంతో అతని తల్లదండ్రులకు అధికారులు సమాచారం అందించారు.
కాగా, హయత్‌నగర్ కుంట్లూరులోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో ఉరేసుకుని ఓ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల మండలం అంబగిరికి చెందిన ఉడతనూరి సౌమ్య(17) స్థానిక రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నది. ఆదివారం తరగతి గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించగా.. మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.