హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయా..? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెంటర్లలో భద్రంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాలు బయటికి వస్తున్నాయి. తాజాగా గణితం బిట్ పేపర్(ఆబ్జెక్టివ్ పేపర్) యూట్యూబ్ చానల్లో దర్శనమిచ్చింది. ఓ యూట్యూబ్ చానల్లో ఈ ప్రశ్నపత్రాన్ని చూపిస్తూ ఆన్సర్లు వివరించడం గమనార్హం. పరీక్ష నిర్వహించిన రోజే ప్రశ్నపత్రం యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గణితం పేపర్‌కు పరీక్ష నిర్వహించారు. లెక్కప్రకారం ఆబ్జెకివ్ పేపర్ బయటికి రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దీన్ని విద్యార్థులు వెంట తెచ్చుకునే వీల్లేదు. ఆన్సర్లు రాసి/ పూరించి ఆన్సర్బుక్లెట్కు కట్టి ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. అయిన బిట్‌పేపర్ బయటికి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రంపై క్యూఆర్‌కోడ్, పేపర్ కోడ్ అన్ని ఉన్నాయి.
పేపర్ కోడ్‌ను బట్టి చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందినదిగా టీచర్లు అనుమానిస్తున్నారు. విద్యార్థులెవరైనా తెచ్చారా అంటే ఇందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే విద్యార్థులు ఆన్సర్లు రాసి ఉండాలి. ఒకవేళ గైర్హాజరైన విద్యార్థులకు చెందినది అనుకుంటే, పరీక్ష తర్వాత గైర్హాజరైన వారి ప్రశ్నపత్రాలను సీజ్ చేస్తారు. ఇవి సీఎస్డీవోల కస్టడీలోనే ఉండాలి. కానీ పేపర్ చూస్తే అలా లేదు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే థియరీ ప్రశ్నపత్రం వ్యవహారం వెలుగుచూసింది. శనివారం నిర్వహించిన గణితం పేపర్లో ఇచ్చిన ప్రశ్నలు ఓ ప్రముఖ విద్యాసంస్థ విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించిన మాదిరి ప్రశ్నపత్రంలోనివి కొద్దిపాటి మార్పులతో ఒకేలా ఉండటం గమనార్హం. పరీక్షకు ముందు ఓ పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు ప్రాక్టీస్ టెస్ట్ నిర్వహించారు. ఆయా ప్రశ్నలను తప్పకుండా ప్రాక్టీస్ చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఇచ్చిన అసలు ప్రశ్నపత్రంలోని 5, 6, 7, 10, 16, 13, 15, 14 నంబర్ ప్రశ్నలు, విద్యార్థుల చేత సదరు యాజమాన్యం ప్రాక్టీస్ చేయించిన వాటిలో కొన్ని ప్రశ్నలు ఒకటి రెండు మార్పులు మినహా ఒకేలా ఉన్నాయి.
పరీక్షలకు ముందు సదరు యాజమాన్యం కొన్ని ప్రశ్నలను విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించడం.. కాస్త అటూ ఇటుగా మార్చి ఇచ్చినవే పరీక్షల్లో అడగడం అనుమానాలకు తావిస్తున్నది. కావాలనే తెలివిగా కొద్ది మార్పులతో ప్రాక్టీస్ పేపర్‌ను సిద్ధం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీని వెనుక పేపర్ సెట్ చేసిన వారి హస్తమైనా ఉండాలి.. లేదంటే ఎస్సెస్సీ బోర్డు నుంచే లీక్ అయి ఉంటుందని టీచర్ సంఘాలంటున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.