రవీంద్రభారతి, ఏప్రిల్ 11: ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల సందర్భంగా రెండు సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఈ వేడుకల్లో బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలు గా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగా రు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఫూలే ఆశయాలను స్మరించుకోవాల్సిన చోట నాయకులు ఒకరికొకరు బాహాబాహీకి దిగడంతో అక్కడికొచ్చిన బీసీ మేధావులు, నేతలు తీవ్ర అసహనానికి గురయ్యారు. జయంతి వేడుకలకు వచ్చిన కిందిస్థాయి నాయకులకు మెమోంటోలు, నిధుల కేటాయింపులో అవినీతి చోటుచేసుకున్నదని ఒక వర్గంపై మరోవర్గం నేతలు వేదికపైనే పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకున్నది.
సామాజిక న్యాయం కోసం పాటుపడ్డ గొప్ప సంఘ సంస్కర్త మహత్మా జ్యోతిబా ఫూలే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర వక్తలు కొనియాడారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఫులే జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళ్లర్పించారు.