మోస్రా (చందూర్), ఆగస్టు 3: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రాలో పర్యటించగా.. ఆమె ముందే పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఒకరినొకరు వ్యతిరేక నినాదాలు చేసుకోవడంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గందరగోళం చోటుచేసుకున్నది. నిజామాబాద్ నుంచి మోస్రా వస్తున్న సమయంలో గ్రామ శివారులో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు మంత్రి సీతక్కకు స్వాగతం పలుకుతూ రవీందర్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు.
మండల సమీకృత భవన ప్రారంభోత్సవంలో మంత్రి ఎదుటే ఏను గు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. ఇరువర్గాల నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చందూర్‌లో పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు ‘ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం..’ అంటూ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.