AEO | కరీంనగర్,సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): డిజిటల్ క్రాప్ సర్వేపై రేవంత్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై వ్యవసాయ విస్తరణాధికారులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే 49రకాల విధులు నిర్వహిస్తూ.. అష్టకష్టాలు పడుతుండగా.. తాజాగా క్రాప్ సర్వే భారాన్ని మోపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2,601 ఏఈవోలు ఉంటే అందులో 60శాతం మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. క్రాప్ సర్వే యాప్‌ను వ్యక్తిగత సెల్ఫోన్లో అప్లోడ్ చేయమంటున్నారని, తద్వారా తమ వ్యక్తిగత సమాచారం యాప్ కంపెనీలకు వెళ్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రులు, అధికారులకు మొరపెట్టుకోగా.. స్పందన కరవైంది. దీంతో పెన్‌డౌన్ సమ్మెవైపు వారు కార్యచరణ రూపొందిస్తున్నారు.
సర్వే..ఓ ప్రహసనం
దేశవ్యాప్తంగా పంటల బీమా, ఆహార భద్రత, పంటల వివరాల సేకరణ, ప్రకృతి వైపరీత్యాల పంట నష్టాలు, పంటల ఉత్పత్తులకు అనుగుణంగా ఎగుమతులు, దిగుమతులు, మార్కెటింగ్‌పై దృష్టి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు రెండేండ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం.. వ్యవసాయ రంగంలో డీపీఐని రూపొందించే లక్ష్యంతో ‘డిజిటల్ అగ్రి మిషన్’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనికోసం రూ.2,817 కోట్లు వెచ్చిస్తోంది. ఈ సర్వేను ఈ నెల 27 నుంచి చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ సర్వేకు రాష్ట్రంలో 18 మండలాలను ఎంపిక చేశారు. ఇందులో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఒకటి. ఇక్కడ పనిచేసే నలుగురు ఏఈవోలతో సర్వే కాదని గుర్తించి.. మరో 23 మంది ఏఈవోలను డిప్యూటేషన్ చేశారు.
ఒక్క మండలం సర్వే చేయడానికి రెండున్నర నెలలు పట్టింది. 18 మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,601 మంది ఏఈవోలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటే.. ఒక్కో ఏఈవో సగటున ఒక సీజన్లో 32 వేల ఫారమ్స్‌లో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. 20 మీటర్ల దూరం నుంచి మాత్రమే సదరు సర్వేనంబర్‌లోని పంటల ఫొటోలను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయవచ్చు. నెట్ పనిచేయకపోయినా, సాంకేతిక ఇబ్బందులున్నా… ఏమీ చేయలేని దుస్థితి. రాష్ట్రంలోని ఏఈవోల్లో 60 శాతం మహిళలే ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఒక మండలాన్ని 30 మంది ఏఈవోలు కలిసి సర్వే చేస్తేనే రెండున్నర నెలలు పట్టినప్పడు ప్రస్తుతం మండలంలో నలుగురు కలిసి ఎలా చేస్తారన్న ప్రశ్నను తెరపైకి తెస్తున్నారు.
ఇతర రాష్ర్టాల్లో భిన్న మార్గాల్లో..
ఆయా రాష్టాల్లో వ్యవసాయ శాఖ సూపర్వైజర్గా మాత్రమే పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకోసం గ్రామ సహాయకులను నియమించారు. వారికి కేంద్ర నిధుల నుంచి గౌరవభృతి చెల్లిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీలకు సర్వే అప్పగించింది. కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమబంగా రాష్ర్టాలు నోడల్ ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నాయి. తమిళనాడులో రెవెన్యూకు అప్పగించారు. మధ్యప్రదేశ్‌లో ఓ స్వచ్ఛంద సంస్థతో సర్వే చేయిస్తున్నారు. రాష్ట్రంలో యాప్ డౌన్లోడ్ చేయని ఏఈవోలను సెలవుగా పరిణించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇతర రాష్ర్టాల్లో సర్వే కోసం ఒక్కో ఫారమ్స్‌కు రూ.15 చెల్లిస్తుండగా, మన రాష్ట్రంలో రూ.2 చొప్పున చెల్లించారు.
విజ్ఞప్తులు చేసి.. పెన్‌డౌన్ వైపు అడుగులు
డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే సాధ్యం కాదని, ఏపీలో మాదిరిగా సహాయకులను నియమించాలని, ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా వివిధ మార్గాల్లో సర్వే చేయించాలని కోరుతూ.. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఈవోలు మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తున్నారు. వ్యవసాయశాఖలో క్షేత్రస్థాయి అధికారి నుంచి మొదలు పైస్థాయి అధికారి వరకు.. కలిసి మొర పెట్టుకున్నారు. శనివారం తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సెంట్రల్ ఫోరం కార్యవర్గ సమావేశాన్ని నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించారు. ఏఈవో రాష్ట్ర అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి సురేశ్‌రెడ్డి, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఈవోల సమస్యలపై టీన్జీవో కేంద్రసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ మద్దతు ప్రకటించారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఏఈవోల సంఘం.. రెండు రోజుల సమయం ఇచ్చి.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్ సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకుంది. సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కలిసి మరోసారి విజ్ఞప్తి చేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్ సమ్మె ఒక్కటే తమ ముందున్న మార్గం అని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.