హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలుగు ప్రజలు గర్వపడేలా, తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని దశదిశలా చాటి చెప్పేలా వ్యవహరిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో తాను మొదటిస్థానంలో ఉండటానికి ఇక్కడి ప్రజల అభిమానం, ఆశీస్సులే కారణమని, ఈ విషయాన్ని ఎన్నటికీ మర్చిపోనని చెప్పారు. ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుక్రవారం ఘనస్వాగతం లభించింది. గరికపాడు చెక్‌పోస్ట్ నుంచి దారిపొడవునా స్థానిక గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. హైకోర్టు రిజిస్ట్రార్‌తోపాటు ఏపీ మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలు ఊపుతూ ఆయనకు స్వాగతం పలికారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరానికి జస్టిస్ రమణ వెళ్లటంతో గ్రామస్థులు సంబురాలు చేసుకొన్నారు. పూలవర్షం కురిపించి, మేళాతాళాలు, కోలాటం నృత్యాలతో ఎడ్లబండిపై ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. గ్రామంలోని దేవాలయంలో జస్టిస్ రమణ కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం జస్టిస్ రమణకు గ్రామంలో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన ఊరిని, కన్నతల్లిని, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. పొన్నవరంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఐకమత్యమే ఔషధమని, తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలనిపిలుపునిచ్చారు.
‘ప్రైవేటు’ అధ్యాపకులకు న్యాయం చేయండి:అధ్యాపకుల సంఘం
ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న అధ్యాపకులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ ప్రైవేటు టెక్నికల్ కాలేజీ ఎంప్లాయీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట సంఘం నాయకులు కల్లూరి మధుసూదన్‌రావు, పర్షరాజు, వెంకటయ్య తదితరులున్నారు.
తెలుగువారికి మరింత గుర్తింపు రావాలి
దేశవిదేశాల్లో తెలుగువారికి తగినంత గుర్తింపు రాలేదని జస్టిస్ రమణ అన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా తెలుగువాళ్లు కావడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. అనంతరం స్వగ్రామం నుంచి జస్టిస్ రమణ గుంటూరు జిల్లాలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు స్వగ్రామానికి వెళ్లారు. ఆదివారం ఆయన ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేరోజు సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవ్వనున్న తేనీటి విందుకు హాజరవుతారు. జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారం మర్యాదపూర్వకంగా కలువనున్నారు.