జనగామ, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ)/గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి, జనగామలోని దేవరుప్పుల మండలం మన్పహాడ్పల్లిలోని రైస్ మిల్లులపై సివిల్ సైప్లె అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం రూ.14.67 కోట్ల సీఎంఆర్ గల్లంతైనట్టు గుర్తించి, క్రిమినల్ కేసులకు సిఫారసు చేశారు. అప్పరాజులపల్లి శ్రీరాజరాజేశ్వరి మిల్లులో సివిల్ సైప్లె అధికారులతోపాటు గూడూరు తహసీల్దార్, టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు తనిఖీ చేసి రూ.9 కోట్ల 56 లక్షల 73 వేల ధాన్యం దుర్వినియోగమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. మన్‌పహాడ్ శ్రీసాయిరాం మాడ్రన్ బిన్నీ రైస్‌మిల్లులో రూ.5.67 కోట్ల విలువైన 1,774.071 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్‌ను దారి మళ్లించినట్టు తేల్చారు. జిల్లా అధికారుల తనిఖీలో రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైనట్టు తేలడంతో యజమాని పీ చంద్రశేఖర్‌రెడ్డిపై మంగళవారం దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. రైస్ మిల్లర్, అతని కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తులపై లావాదేవీలను అనుమతించవద్దని జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లకు లేఖ రాశారు. దాడుల్లో టీసీఎస్వో ప్రేమ్‌కుమార్, జిల్లా సివిల్ సైప్లె అధికారి కృష్ణవేణి, తహసీల్దార్ శ్వేత, ఏఎస్వో రమేశ్, టాస్క్‌ఫోర్స్ ఎస్సై కృష్ణ, ఆర్ఐ మల్లయ్య పాల్గొన్నారు.