Mana Uru Mana Badi | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ సర్కారు చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ ప్రశ్నార్థకమైంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా? లేక ఆపేస్తారా? అన్నది ఇప్పటికీ తేలడం లేదు. దీనిపై ఏదో ఒకటి తేల్చాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. పథకం కొనసాగింపు, పెండింగ్ బిల్లులు క్లియరెన్స్‌పై స్పష్టతనివ్వాలని లేఖలో ప్రస్తావించినట్టు తెలిసింది. మొత్తం 12 అంశాలతో బడులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాన్ని మూడు విడతలుగా అమలుకు గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసింది.
2022 మార్చి 8న వనపర్తిలో కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేసింది. వీటి అభివృద్ధికి రూ.3,497 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో తేల్చారు. 9,123 బడుల్లో పనులు సైతం చేపట్టారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు చేపట్టిన పనులకు సంబంధించి వెయ్యికోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రూ. 650 కోట్లు సివిల్‌వర్క్స్‌కు సంబంధించినవే! మరో రూ. 350 కోట్లు ఇతర పనులవి ఉన్నాయి. గత డిసెంబర్ నుంచి రూపాయి కూడా విడుదల కాలేదు.