హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : మిగిలిపోయిన దొడ్డుబియ్యం విక్రయించేందుకు వేలం వేసినా సివిల్ సప్లయ్‌కి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరువాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సివిల్ సప్లయ్ అధికారులు ప్రక్రియను విరమించుకుని మరోసారి టెండర్‌కు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రస్థాయిలో టెండర్ పిలిస్తే ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనరనే ఉద్దేశంతో సివిల్‌సప్లయ్ అధికారులు జెమ్ పోర్టల్ ద్వారా గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వం రేషన్‌కార్డులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడంతో అప్పటికే నిల్వ ఉన్న 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పేరుకుపోయాయి. వాటిని వేలంద్వారా విక్రయించాలని భావించి గత నెల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చినా ఏమీ పడకపోవడంతో అధికారులు కారణాల విశ్లేషణలో పడ్డారు.
ముఖ్యంగా మొత్తం 1.40 లక్షల టన్నులను ఒకే లాట్ కింద పెట్టడమే ఇబ్బందికరంగా మారిందని, దీంతో చిన్న బిడ్డర్లు పాల్గొనే అవకాశం లేకుండాపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. పెద్ద బిడ్డర్ల అనాసక్తి., చిన్నోళ్లకు అవకాశం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. కనీసం చిన్న లాట్లుగా వేస్తే ఎక్కువ బిడ్డర్లు పాల్గొనేవారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వేలం వేయాలనుకున్న బియ్యం ధరను కిలోకు 24 రూపాయలుగా ప్రభుత్వం ముందే నిర్ణయించడం కూడా బిడ్డర్ల అయిష్టతకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు. వేలం వేయాలనుకుంటున్న బియ్యం అప్పటికే పాతవిగా మారడం, సగానికిపైగా పురుగులు పట్టి నాణ్యత లోపించి ఉండటంతో ఆ ధర మరీ ఎక్కువ అనే బిడ్డర్లు అభిప్రాయాలూ వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. అధికారుల 6వ పేజీలోనిర్లక్ష్యం, ముందుచూపులేని విధా నం సివిల్సప్లయ్కు ఆర్థికంగా తీవ్రనష్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏప్రిల్ నుంచి రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం దొడ్డుబియ్యానికి బదులు సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తుందని తెలిసినా అధికారు లు క్షేత్రస్థాయికి దొడ్డుబియ్యాన్ని పం పించడంతో 1.4 లక్షల టన్నుల బియ్యం పేరుకుపోయింది. 40వేల టన్నుల వరకు రేషన్‌షాపుల్లో ఉండ గా లక్ష టన్నులు గోదాముల్లో మూ లుగుతున్నట్టు చెబుతున్నారు. రేషన్షాపుల్లోని బియ్యం పందికొక్కులు బుక్కి, ముక్కిపోయి పాడైపోయినట్టు డీలర్లు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. అధికారుల ఉదాసీనతతోనే 10 నెలలుగా 500 కోట్ల విలువైన బియ్యం అటు రేషన్‌దుకాణాలు, ఇటు గోదాముల్లో మిగిలిపోయినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డుబియ్యా న్ని వేలం వేయాలని సెప్టెంబర్ 9న అప్పటి సివిల్ సప్లయ్ కమిషనర్ చౌ హాన్ ఉత్తర్వులు జారీ చేసినా టెండర్ పట్టాలెక్కడానికి 4నెలలు పట్టడం గమనార్హం. అధికారులు ముందుగా స్టాక్ నిలిపేసినా, లేదంటే స్టాక్‌ను వెంటనే వేలంలో అమ్మినా సివిల్ సప్లయ్‌కు భారీ నష్టం తప్పేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.