Paddy Procurement | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో సివిల్ సప్లయ్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు కనీసం పరదాలకూ(టార్పాలిన్లు) దిక్కులేని పరిస్థితి నెలకొన్నది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు సమయంలో అందించే టార్పాలిన్లు, వేయింగ్, తేమశాతం లెక్కించే మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, కాలిపర్లను ఇప్పటికీ సరఫరా చేయలేదు. వీటి కొనుగోలుకు కనీసం టెండర్లూ పిలువలేదు. సివిల్ సప్లయ్, మార్కెటింగ్ శాఖల సమన్వయ లోపం రైతులకు శాపంగా మారడంతోపాటు వాన ముప్పు పొంచి ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వస్తువులను సరఫరా చేసే బాధ్యతను సివిల్ సప్లయ్‌శాఖ మార్కెటింగ్ శాఖకు అప్పగిస్తున్నది. మార్కెటింగ్ శాఖ హాకా, ఆగ్రోస్ ద్వారా పరికరాలు కొనుగోలు చేసి వాటిని సివిల్ సప్లయ్‌కి సరఫరా చేస్తున్నది. అయితే, గత రెండేండ్లుగా హాకా, ఆగ్రోస్‌కు పరికరాల కొనుగోలుకు సంబంధించిన నిధులు చెల్లించలేదని, వీటికి సంబంధించి రూ.80 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. బకాయిల విడుదలకు సంబంధించి మార్కెటింగ్‌శాఖ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, దీంతో సరఫరాదారులు టెండర్ వేసేందుకు వెనకాడుతున్నారని, పాత బకాయిలు చెల్లిస్తే తప్ప టెండర్లు వేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొన్నదని తెలిసింది.
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ప్రతి పైసా ఎఫ్‌సీఐ ఇస్తున్నది. పరికరాల కొనుగోలుకు ఒక శాతం నిధులను మార్కెటింగ్ శాఖకు ఇస్తున్నది. ప్రతియేటా నిధులు వస్తుండగా పరికరాల కొనుగోలుకు సంబంధించి బకాయిలు ఎందుకు పేరుకుపోయాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌సీఐ నిధులు ఇవ్వడం లేదా? లేక మార్కెటింగ్ శాఖ.. హాకా, ఆగ్రోస్‌కు ఇవ్వడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వరికోతలు మొదలయ్యా యి. సివిల్ సప్లయ్ అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కొనుగోళ్లు ప్రారంభమైనా.. కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటివరకు టెండర్లు పిలవకపోవడం గమనార్హం. రైతులకు అవసరమైన టార్పాలిన్లు, వేయింగ్, తేమ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు ఎప్పుడు అందిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో టెండర్లను పక్కన పెట్టినట్టు సమాచారం.