Ration Cards | హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్‌కార్డుల కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈసారి మీ-సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. కొత్త కార్డుల జారీకి, పాత కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ మీ-సేవ కమిషనర్‌కు సివిల్‌సైప్లె కమిషనర్ శుక్రవారం లేఖ రాశారు. అయితే ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారనే అంశంపై మాత్రం ఇటు సివిల్‌సైప్లె, అటు మీ-సేవ అధికారులు స్పష్టతనివ్వలేదు.
కాంగ్రెస్ పాలన.. దరఖాస్తుల పాలనగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పథకానికి పదేపదే దరఖాస్తులు తీసుకోవడంపై విమర్శలొస్తున్నాయి. తాజాగా రేషన్‌కార్డుల కోసం మళ్లీ మీ-సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలనే నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం ఇది మూడోసారి. ఇంతకుముందు ప్రజాపాలన పేరుతో గత జనవరిలో దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవల గ్రామసభల పేరుతో మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మీ-సేవ ద్వారా మూడోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
రేషన్‌కార్డుల కోసం ఇంతకుముందు తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి కొత్తకార్డులు, పాత కార్డుల్లో చేర్పులు మార్పుల కోసం 18 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఇటీవలి గ్రామసభల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాలకు దరఖాస్తులను తీసుకొని అర్హులను గుర్తించినట్టు ప్రకటించింది. గ్రామసభల ద్వారా సుమారు 6 లక్షల కొత్త కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కానీ వారికి రేషన్‌కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించడంతో గ్రామసభల్లో అర్హులుగా గుర్తించిన వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరికి కొత్త కార్డులు ఇస్తారా లేక వీళ్లు కూడా మళ్లీ మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించడం ద్వారా పాతవన్నీ బుట్టదాఖలైనట్టు తెలుస్తున్నది.