కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 22: రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు. గురువారం కరీంనగర్‌లోని తారక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మంచి వ్యక్తి అని, ఆయనను కలిపించాలని 2014లో స్వయంగా బండి సంజయ్ తనను అడిగిన విషయాన్ని గుర్తుచేశారు.
అప్పట్లో ఆయన్ను బీజేపీలో ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నాననే గర్వంతో బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమంలో ప్రజలు ఎదురు తిరుగుతున్నారని తెలిపారు. ఎక్కడికి పోయినా సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు బీజేపీ నాయకులకు చెప్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు.
కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అవార్డులు అత్యధికంగా అందుకున్న రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఈ అవార్డులు ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కదా? మరి తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జరగకపోతే ఎందుకు ఇన్ని అవార్డులు ఇచ్చారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సహనం కోల్పోయి రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు.