హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ వెల్లడించారు. ఈ బృందాలు శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైసుమిల్లుల్లో ప్రత్యేక తనిఖీలు చేస్తాయని పేర్కొన్నారు. సీఎంఆర్‌లో జరుగుతున్న జాప్యంపై శుక్రవారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్న జిల్లాల నుంచి తనిఖీలు ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని అమ్ముకున్న రైసు మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా ఎఫ్‌సీఐకి సీఎంఆర్ ఇవ్వకపోతే ఆ బియ్యానికి బదులుగా 25 శాతం జరిమానాతో నగదు రూపంలో వసూలు చేస్తామే తప్పా, బియ్యాన్ని మాత్రం తీసుకోబోమని స్పష్టం చేశారు. 25వ తేదీలోగా ఆయా జిల్లా అధికారులు ఎఫ్‌సీఐకి బిల్స్ సబ్మిట్ చేయాలని ఆదేశించారు.
యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం మిల్లింగ్, సరఫరా గడువును కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వినియోగదారులు, ఆరోగ్య, ప్రజా పంపిణీ శాఖ డిప్యూటీ సెక్రటరీ జై ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎంఆర్ ధాన్యాన్ని మార్చి 31లోగా పూర్తి చేయాలని సూచించింది.