హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బకాయి సీఎమ్మార్ (బియ్యం)ను 15 రోజుల్లోగా ఇవ్వాలని, లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తప్పవని సివిల్ సైప్లెస్ చైర్మన్ రవీందర్‌సింగ్ డీఫాల్ట్ మిల్లర్లను హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం సివిల్‌సైప్లె భవన్లో కమిషనర్ అనిల్‌కుమార్‌తో కలిసి 2019-20లో డిఫాల్ట్ అయిన రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. సీఎమ్మార్‌లో జాప్యం వల్ల సంస్థపై వడ్డీ భారం పెరుగుతున్నదని తెలిపారు.
సీఎమ్మార్ ఇవ్వడంలో సమస్యేంటని నిలదీశారు. ఒకప్పుడు రైస్‌మిల్లర్లు.. మిల్లును నడపలేక వాటిని అమ్ముకునే స్టేజ్ నుంచి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల కొత్తగా రైస్‌మిల్లును ఏర్పాటు చేసే స్టేజ్‌కి ఎదిగారని గుర్తు చేశారు. అలాంటి ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి మిల్లరుపై ఉన్నదని చెప్పారు. సీఎమ్మార్ తీసుకునే సమయంలో నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని ఆదేశించారు.
బండి సంజయ్‌కి మతిభ్రమించింది
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని చైర్మన్ రవీందర్‌సింగ్ మండిపడ్డారు. ఆలస్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్లనే ధాన్యం తడిసిపోయిందన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ఈ నెల 15 నుంచి కొనుగోలు ప్రారంభించాలని చెప్పినప్పటికీ సీఎం కేసీఆర్ రెండు రోజులు ముందు నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించినట్టు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటివరకు 3 వేల కేంద్రాలను ప్రారంభించి 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. నిరుడు ఇదే సమయానికి 93 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశామని చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. బండి సంజయ్‌కి చేతనైతే రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి కమిటీని రప్పించాలని, అలాగే ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చూడాలని రవీందర్‌సింగ్ సవాల్ విసిరారు.