హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ‘ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? సంబురాలు చేసుకునే నైతిక హక్కు కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి లేదు. నువ్వు ప్రజల ముందు ముద్దాయివి’ అంటూ పౌరహక్కుల సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లు పెరిగిపోతున్నాయని, చేయనివ్వకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఇదెక్కడి నీతి అంటూ పౌర హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్ నారాయణరావు ప్రశ్నిస్తున్నారు. ములుగు బూటకపు ఎన్కౌంటర్లపై ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మరిన్ని విషయాలు పంచుకున్నారు.
రేవంత్‌రెడ్డి ఏడో గ్యారెంటీగా హక్కుల పునరుద్ధరణ అని చెప్పారు. మొదటి రెండు నెలలు మినహా.. ఈ ఏడాదిలో కనీసం భావ ప్రకటనా స్వేచ్ఛ, మాట్లాడుకునే స్వేచ్ఛ, సమానత్వపు స్వేచ్ఛ ఎక్కడా లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా అణచివేస్తున్నది. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. 16 మందిని ప్రభుత్వం బలితీసుకుంది. ములుగులో విషప్రయోగం చేసి, చిత్రహింసలు పెటి కాల్చి చంపారు. ఇది బూటకపు ఎన్కౌంటర్.
గతంలో మావోయిస్టుల మృతదేహాల దగ్గరకు వెళ్లి, నిజనిర్ధారణ చేయించి, ఆపై అంత్యక్రియలు చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మృతదేహాన్ని కనీసం బంధువులు చూద్దామని వచ్చినా పంపించడం లేదు. కాల్పుల్లో మరణించిన మధు శవాన్ని భార్యకు కూడా చూపెట్టలేదు. సొంతవాళ్లు చనిపోతే.. వారు చూసిన తర్వాత అప్పుడు నిర్ధారణ చేసుకొని పోస్టుమార్టం చేయాలి. గతంలో పరిస్థితి ఇలా లేకపోయేది. ఇదెక్కడి ప్రజాపాలన? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి రాజ్యాంగం? ఇదెక్కడి మానవత్వం? ఎందుకింద దుర్మార్గం?
రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణలో నక్సలైట్లు ఉంటే ఎంతబాగుండో అన్నాడు. ఇప్పుడు నక్సలైట్లను పట్టుకొని చంపుతున్నాడు. ఇదేనా మీ ప్రజాపాలన. అమరుల త్యాగాల ద్వారా నిర్మించుకున్న ఈ భూమిలో నువ్వు హత్యలు ఎలా చేస్తావ్? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకపోయినా నువ్వు సీఎం అయ్యావు.. రక్తం పారిస్తానం టే మేమెలా ఒప్పుకుంటాం.
మనిషి జీవించే హక్కు పట్ల ఏ ప్రభుత్వమైనా బాధ్యతగా ఉండాలి. లేకపోతే అందులో ప్రజాస్వామ్యం ఏమున్నది? దానికి అర్థమేమున్నది? ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ ఉంది. ఎవరు ఏ తప్పు చేసినా కోర్టుల ద్వారా శిక్షించాలి. పోలీసులకు చంపడం ద్వారా శిక్షించే అధికారం ఎక్కడిది? ఏ రాజ్యం కల్పించింది? శిక్షించడమంటే హత్య చేయడమా? ఇది సరికాదు. దీనికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇకపై ఎన్కౌంటర్లు జరగవని హామీ ఇవ్వాలి. ఒక మనిషిపై వంద అభిప్రాయాలు ఉండొచ్చు.. జీవించే హక్కును కాలరాయొద్దు. అది రాజ్యాంగపు హక్కు.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమమే లేనప్పుడు కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లో రాష్ట్రంలో మూడు క్యాంపులు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? అవి చాలవన్నట్టు మరో నాలుగు క్యాంపులకు ఏర్పాట్లు ఎలా చేస్తారు? మన బార్డర్లో పోలీసు క్యాంపులు ఎందుకు? ఎవరికోసం పెడుతున్నారు? ఏ కగార్ ఆపరేషన్‌లో భాగంగా పెడుతున్నారు? అలా చేస్తే మీరు కూడా బీజేపీ విధానాల్లో, వారి అణచివేతలో భాగమైనట్టే కదా.చేతనైతే క్యాంపులు రద్దు చేసి శాంతి చర్చలు జరుపు. హత్యాకాండలు జరుపుతానంటే ప్రజలు ఎలా ఒప్పుకుంటారు?
కొందరు ప్రజాస్వామికవాదులు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. కానీ, ఆ విషయాలు మీడియా దృష్టికి రావడం లేదు. చర్చలకు ప్రభుత్వం ఒప్పుకోనట్లుంది. అందుకే ‘ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక’ను ఏర్పాటు చేశాం. ఇందులో అందరూ భాగస్తులే. చర్చలకు రావడానికి ముందు మావోయిస్టు పార్టీపై, అనుబంధ సంఘాలన్నింటిపై నిషేధం ఎత్తివేయాలి. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి. నాడు వైఎస్ చర్చలు జరపలేదా? వైఎస్ ఫొటోలు పెట్టుకొని తిరగడం కాదు.. ఆ చర్చల విధానాలు అమలు చెయ్.
కోవర్టు ఆపరేషన్లతోనే బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. రాధ మర్డర్ కూడా పోలీసుల ప్రోత్సాహంతోనే జరిగింది. ములుగు, కర్కగూడెం ఎన్కౌంటర్లు కూడా బూటకమే. ఒక్క పోలీసుకు గాయం కాలేదు. స్థానిక గ్రామస్తుల సమాచారం ప్రకారం.. వారికి మత్తుమందు కలిపిన ఆహారం పెట్టి, పట్టుకొని చిత్రహింసలు పెట్టి బూటకంగా కాల్చివేశారు.
శాంతిచర్చలు పునరుద్ధరించాలి. అన్ని ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పోలీసులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వా సం ఏర్పడుతుంది. లేకపోతే తెలంగాణలో ఓ దుర్మార్గపు, నియంతృత్వపు పాలన చేస్తున్నట్టు మేము భావిస్తాం. డెమొక్రటిక్‌గా పాలించు, ఎవరైనా తప్పు చేస్తే కోర్టుల ద్వారా శిక్షించు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరువాలి. 12 నెలల కాలంలో 16 మందిని చంపావంటే ఎలా పాలిస్తున్నావని అర్థం చేసుకోవాలి.