Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్‌లోని సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం.నం. 30/2026 కేసును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలో ఈ కేసు సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులిచ్చింది.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకోవడంతో పాటు, రహదారిపై అనధికారికంగా గుమిగూడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి ఆరోపణలతో కేసు నమోదైందని సీఐడీ అధికారులు నోటీసులో తెలిపారు. అదే సమయంలో పోలీసు అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులకు దిగడం వంటివి చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు కోసం కౌశిక్ రెడ్డి ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు. నోటీసులను పట్టించుకోవాలని, దర్యాప్తునకు సహకరించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Padi Kaushik Reddy