మక్తల్, ఫిబ్రవరి 18 : లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి అనుకూలంగా చార్జిషీటు రాస్తామని చెప్పి రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన మంగళవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్నది. ఏసీబీ మహబూబ్‌నగర్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శ్రీనిధి ఫైనాన్స్ నడుపుతున్న వ్యక్తి, మక్తల్‌లో ఒక బ్రాంచ్ ప్రారంభించిన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యావెంకట్రాములుపై లైంగిక దాడి కేసు నమోదైంది. అతనికి హైకోర్టులో కండీషన్ బెయిల్ వచ్చింది.
తరచూ మక్తల్ స్టేషకు హాజరవుతున్న క్రమంలో చార్జిషీటు అనుకూలంగా రాయడానికి సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహులు, సింగసాని శివతో కలిసి సంధ్యావెంకట్రాములును రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో సంధ్యావెంకట్రాములు నుంచి కానిస్టేబుల్ నర్సింహులు, శివ రూ.20 వేలు తీసుకొని జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకున్న విషయం రుజువు కావడంతో సీఐతోపాటు కానిస్టేబుళ్లు నర్సింహులు, శివను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.