హైదరాబాద్ : ప్రపంచ ప్రఖ్యాత మెదక్(Medak) కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సంబురాలు(Christmas celebrations) అంబరాన్నంటాయి. శుక్రవారం తెల్లవారుజామునే ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి మెదక్ సీఎస్ఐ చర్చికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది.
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. మొదటి ఆరాధనకు చర్చి ఇన్చార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ పాల్గొని భక్తులనుద్దేశించి దైవవాక్య సందేశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.