హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) :రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లను సమూలంగా తీసేస్తామని చెబుతున్న బీజేపీని క్రిస్టియన్ మైనార్టీ సోదరులంతా కలిసి ఓడించాలని ‘క్రిస్టియన్ ఇంటిలెక్చువల్ ఫోరం’ పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ‘భారత రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం గొంతు విప్పుదాం’ అనే అంశంపై రాష్ట్ర క్రిస్టియన్ మేధావులు నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ రాజేశ్ సొలోమాన్ మాట్లాడుతూ.. దేశంలోని అణగారిన, బలహీనవర్గాలకు న్యాయం చేసేందుకు ఆ దేవుడు పంపిన అభినవ ప్రవక్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
ఇక నుంచి ప్రతి చర్చిలో సండేస్కూల్ విద్యార్థులకు బైబిల్ బోధనలతో పాటు రాజ్యాంగం గురించి బోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలంటే కచ్చితంగా రిజర్వేషన్ ఉండాల్సిందేనని డాక్టర్ అశిష్ చౌహాన్ అన్నారు. బీజేపీ పాలనలో క్రైస్తవులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, అలాంటి సమయంలోనైనా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకోవాలని రిటైర్డ్ ఏడీజీ బాబురావు చెప్పారు. తర్వాత, క్రిస్టియన్లంతా కలిసి బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ మధుకుమార్, సుధీర్, దాస్ యోనాతన్, ఉదయ్‌కాంత్, వివిధ చర్చిల పాస్టర్లు, క్రిస్టియన్ విద్యావంతులు, ఎన్ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.