హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ పోరాటయోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ అందించిన పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. గురువారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని కేసీఆర్ నెమరువేసుకున్నారు. అణచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగానే పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల కోసం సంక్షేమ, ప్రగతి కార్యాచరణను అమలు చేసిందని గుర్తుచేశారు.
దేశంలో మరెక్కడాలేని విధంగా తెలంగాణ సబ్బండవర్గాలకు వేల కోట్లతో పలు పథకాలను అమలు చేసి వారిని గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిపిందని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక పా లనపై ధిక్కారాన్ని ప్రకటించిన ఐలమ్మ ప్రతిఘటనాతత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసిందన్నారు. బలహీనవర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయటమే ఐలమ్మకు మనం అర్పించే ఘన నివాళి అని తెలిపారు.