మక్తల్, మే 24 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా భూములను గుంజుకోవాలని చూస్తే సహించేదిలేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్పల్లికి చెందిన రైతులు శనివారం చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ఇదివరకే భూత్పూర్ రిజర్వాయర్‌లో 300 ఎకరాలను కోల్పోయామని, మళ్లీ నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పేరిట మరో 90 ఎకరాలు తీసుకుంటామంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు. భూములు కోల్పోతున్న రైతులకు సర్కారు, అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా సర్వేలు చేస్తూ పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు తెలిపారు.
చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను లాక్కోవాలని చూడటం సరికాదన్నారు. పేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు లేవని, అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రాజెక్టు చేపడితే నిర్వాసిత రైతులకు న్యాయం చేయాల్సిందేనని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.