నార్కట్‌పల్లి, జనవరి 10 : ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేటీఆర్‌పై అక్రమంగా ఫార్ములా-ఈ కేసు పెట్టారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ నేతలను మానసికంగా దెబ్బతీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏ రకంగా బెదిరింపులకు పాల్పడిన ప్రజల తరఫున పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. అసమర్థ విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రకటించినట్టు రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇవ్వలేదని, రూ.2 లక్షల రుణ మాఫీ పూర్తి చేయలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.