హైదరాబాద్, ఆగస్టు 5( నమస్తే తెలంగాణ) : మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ అజ్ఞాత నేత కొణిదెల చిరంజీవి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ వెనుక మతలబేమిటో తేలిపోయింది. చిరంజీవిని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అన్నీ తానే ముందుండి చూసుకుంటానని, ఉప ఎన్నికల్లో గెలిపించి, మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం ఆఫర్‌కు చిరంజీవి వెంటనే ‘ఎస్’ అని కానీ, ‘నో’ అని కానీ చెప్పలేదని సమాచారం. ఇప్పటికే తన సోదరుడు పవన్‌కల్యాణ్ పొరుగు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తాను తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని చిరంజీవి అనుమానం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తన కుటుంబసభ్యులతో చర్చించిన తరువాత నిర్ణయం తెలియజేస్తానని చిరంజీవి చెప్పినట్టు సమాచారం.
18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఈ అపవాదును తొలిగించుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సరైన వేదిక అని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ మీద జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు సీఎం చేయించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్టు తెలిసింది. ఇప్పటికే మూడు పర్యాయాలు సర్వే చేయించినప్పటికీ, అన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ సగటున 10% ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ వ్యూహకర్త ప్రత్యేక దృష్టి సారించి నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ 11% ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్టు తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత చరిష్మా మీద గెలిచే అభ్యర్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్న చిరంజీవిని బరిలోకి దించాలని పార్టీ వ్యూహకర్త సునిల్ కనుగోలు సూచించినట్టు సమాచారం. ఆయన సలహా మేరకే ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చిరంజీవిని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.75 లక్షల ఓట్లు ఉండగా, అందులో 1.25 లక్షలపైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకపాత్ర పోషించే అవకాశం ఉన్నందున అధిష్ఠానం మాజీ క్రికెటర్ అజరుద్దీన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. కానీ, సీఎం వర్గం ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇక్కడినుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతున్నది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి తన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు చిరంజీవిని నిలబెట్టి గెలిపించుకొని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఇటు పార్టీపరంగా ఇమేజ్ పెరగడంతోపాటు, అటు పవన్‌కల్యాణ్ ఆశీస్సులు కూడా పొందవచ్చని, మరోవైపు అజారుద్దీన్‌ను అడ్డుతొలిగించుకోవచ్చని కూడా ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.