నర్సాపూర్, జూన్ 23 : ఏడాదిన్నరలోనే రాష్ట్రంలోని పంచాయతీల్లో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘చెత్త’ మార్పునకు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి సాక్ష్యంగా నిలిచింది. గ్రామానికి గత సీఎం కేసీఆర్ అందించిన జీపీ ట్రాక్టర్‌కు ఘనత వహించిన రేవంత్ ప్రభుత్వం కనీసం డీజిల్ కూడా అందించలేని దుస్థితితో వాహనం మూలకుపడింది. ఫలితంగా పంచాయతీ కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ కాస్తా చెత్త డబ్బాలా మారింది. సోమవారం ఈ ఊరిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పర్యటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు, పంచాయతీ కార్యాలయం వద్ద చెత్త లోడ్‌తో మూలకు పడి ఉన్న ట్రాక్టర్‌ను చూసి షాక్ అయ్యారు. అక్కడే ఉన్న పారిశుధ్య కార్మికులు, గ్రామస్థులను ఊరి పరిస్థితి గురించి హరీశ్ ఆరా తీయగా వారంతా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ట్రాక్టర్లో డీజిల్ పోయలేక చెత్త తీయడం లేదని, తమకు జీతాలు కూడా రావడం లేదని పారిశుధ్య కార్మికులు వాపోయారు. ట్రాక్టర్లో డీజిల్ లేక చెత్త తీయకపోవడంతో గ్రామస్థులు తమపై కోపానికి వస్తున్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ట్రాక్టర్‌కు ఆయిల్, ఫిల్టర్ చేంజ్ చేయలేదని, సర్వీసింగ్ కూడా చేయలేదని, బీమా, రోడ్ ట్యాక్స్ కట్టలేదని, చివరికి డీజిల్‌కు డబ్బుల్లేక బండి తాళాలను ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీకి అప్పగించామని తెలిపారు. పగిలిన మంచినీటి పైప్‌లైన్‌ను సరిచేయడం లేదని, విద్యుత్తు దీపాలు సరిగ్గా వెలగడం లేదని గ్రామస్థులు చెప్పుకొచ్చారు. 20 రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి గ్రామమంతా కంపు కొడుతున్నదని, అసలే వానకాలం కావడంతో ఎక్కడ రోగాలు ప్రభలుతాయేమోనని భయపడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు.
గ్రామంలో సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శిని హరీశ్ ప్రశ్నించగా ఇప్పటికే తాను మిత్తికి అప్పు తెచ్చి రూ.80 వేలు పంచాయతీకి పెట్టానని తెలిపారు. ‘నా జీతం 30 వేల రూపాయలు.. నేను అప్పు తెచ్చి పెట్టిన డబ్బులు ఎట్ల వస్తయో అర్థం కావడం లేదు’ అంటూ వాపోయారు.
గ్రామస్థుల మొర విన్న అనంతరం హరీశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అందించిన పంచాయతీ ట్రాక్టర్లకు కనీసం డీజిల్ కూడా పోయలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని ఎద్దేవాచేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెపల్లెకు తేవాలని ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చి, డంపింగ్ యార్డులు కట్టించి కేసీఆర్ స్వచ్ఛమైన పల్లెలను తయారుచేస్తే రేవంత్ సర్కారు కనీసం ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయడం లేదని మండిపడ్డారు. ‘మార్పు మార్పు అన్నరు.. ఇదేనా మార్పు? కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లను మూలకు పడేయడం మార్పా? ట్రాక్టర్లో డీజిల్ పోయకపోవడం మార్పా? అని నిలదీశారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్నవు.. ట్రాక్టర్‌ను మూలన పడేయడమా? బుగ్గలు వేయకపోవడమా? ఆనవాళ్లు లేకుండా చేయడమంటే?’ అని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడపదాటడం లేదని విమర్శించారు. తాగునీటి పైప్‌లైన్ పగిలితే మరమ్మతు చేయలేని దుస్థితి నెలకొన్నదని అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి జీతాలివ్వకుంటే పారిశుధ్య కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఒకటో తేదీ నాడే జీతాలు అని రేవంత్‌రెడ్డి అంటున్నాడని, అందరిలో పేద ఉద్యోగులైన పారిశుధ్య కార్మికులకు జీతాలిచ్చే తెలివి ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. పంచాయతీ సెక్రటరీలను పలకరిస్తే వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని వాపోయారు. ‘రాష్ట్రం అస్తవ్యస్తమవుత్నునది. రేవంత్‌రెడ్డీ.. ఇప్పటికైనా కండ్లు తెరువు’ అని హరీశ్ తీవ్రంగా హెచ్చరించారు.
నర్సాపూర్, జూన్ 23 : తప్పు రేవంత్ సర్కారుది అయితే.. శిక్ష పంచాయతీ కార్యదర్శికి పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని చిప్పల్తుర్తి పంచాయతీ సెక్రటరీకి కలెక్టర్ సోమవారం మెమో జారీ చేశారు. డీజిల్ లేక పంచాయతీ ట్రాక్టర్‌ను 20 రోజులుగా మూలకు పడేశారన్న కారణంతో కార్యదర్శికి మెమో జారీ చేసినట్టు తెలిసింది. చిప్పల్‌తుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఊరిలో సమస్యలు తెలుసుకునేందుకు గ్రామస్థులను కలిసి ఆరా తీశారు. చెత్త లోడ్‌తో పంచాయతీ కార్యాలయం వద్దే మూలకు పడి ఉన్న జీపీ ట్రాక్టర్‌ను చూసి అవాక్కయ్యారు. అక్కడే ఉన్న పారిశుధ్య కార్మికుల ద్వారా పరిస్థితిని తెలుసుకున్నారు. ‘సర్కారు గాసమిస్తలేదు.. అందుకే డీజిల్ లేక ట్రాక్టర్ తీస్తలేం.. చెత్త ఎత్తుతలేమని ఊరోళ్లు మామీదికి కోపానికొస్తుండ్రు.. డీజిల్‌కు డబ్బుల్లేక బండి తాళాలను ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీకి అప్పగించినం’ అని సిబ్బంది తెలిపారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శితో హరీశ్ మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. గ్రామంలో సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. పంచాయతీ సెక్రటరీ బదులిస్తూ ఇప్పటికే తాను మిత్తికి అప్పు తెచ్చి రూ.80 వేలు పంచాయతీకి పెట్టానని తెలిపారు. డీజిల్ లేక ట్రాక్టర్ మూలకు పడిన విషయంలో సాయంత్రానికల్లా కార్యదర్శిని బాధ్యులుగా చేస్తూ కలెక్టర్ మెమో జారీ చేశారు.
ప్రభుత్వం నిధులివ్వకపోవడం వల్లే ట్రాక్టర్లో డీజిల్ లేక చెత్త సేకరించడం లేదని, రేవంత్ సర్కార్ నిధులిస్తే ట్రాక్టర్లో డీజిల్ పోసేవారు కదా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. నెలనెలా నిధులు రాక పంచాయతీల అభివృద్ధి కుంటు పడుతున్నదని, దీనికి పంచాయతీ సెక్రటరీలను బలిచేయడం ఏమిటని నిలదీస్తున్నారు. పంచాయతీల్లో నిధులుంటే ట్రాక్టర్ల నిర్వహణ, చెత్త సేకరణ, వీధి దీపాలు, పైప్‌లైన్ రిపేర్లు తదితర పనులు సక్రమంగా జరుగుతాయని, నిధుల్లేక తాము బయట వడ్డీలకు డబ్బు తెచ్చి.. బంగారం కుదవ పెట్టి మరీ గ్రామాల్లో మరమ్మత్తులు చేయిస్తున్నామని పలువురు పంచాయతీ సెక్రటరీలు వాపోతున్నారు. రూ.80 వేలు అప్పుతెచ్చి గ్రామాభివృద్ధికి ఖర్చు చేసిన చిప్పల్తుర్తి పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వం అభినందించాల్సింది పోయి మెమో జారీ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులను బలిచేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. తోచిన విధంగా గ్రామాలను నెట్టుకొస్తున్న వారికి మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా చిప్పల్తుర్తి కార్యదర్శికి ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.