కేసముద్రం, ఏప్రిల్ 22 : వ్యాపారులు కావాలనే మిర్చి ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు 607 బస్తాల మిర్చి విక్రయానికి రాగా, గరిష్ఠంగా రూ. 11,609, కనిష్ఠంగా రూ.8,005 చొప్పున పలికింది. తాలురకం క్వింటాల్‌కు రూ.5,700, కనిష్ఠంగా రూ.4 వేలు పలికింది. గతవారం క్వింటాల్ మిర్చి ధర రూ.13 వేలు ఉండగా ఒక్కసారిగా రూ.1,500 తగ్గించారని ఆరోపిస్తూ రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వ్యాపారులు కుమ్మక్కై ఒకరిద్దరు తక్కువ ధరలకు టెండర్లు వేసుకుంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
లాట్ నంబర్ చిట్టీపై క్వింటాల్‌కు 2 కిలోల చొప్పున కోత విధిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. నాణ్యత లేదంటూ ధరలు తగ్గించడం సరికాదని అన్నారు. ఒకరిద్దరు రైతుల మిర్చికి అధిక ధరలు వేసి మిగిలిన వాటికి ధరలను పూర్తిగా తగ్గిస్తున్నారని ఆరోపించారు. రైతులతో ఎస్సై కరుణాకర్, మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు మాట్లాడి శాంతింపజేశారు. ధర తగ్గిన వారికి మళ్లీ టెండర్లు వేస్తారని తెలుపడంతో రైతులు ఆందోళనను విరమించారు.