మహబూబాబాద్ రూరల్, మార్చి 6 : వ్యవసాయ మార్కెట్లోకి మిర్చి బస్తాలను అనుమతించాలని రైతులు ఆందోళనకు దిగారు. బయ్యారం, డోర్నకల్ సుదూర మండలాల నుంచి వచ్చిన రైతులు గురువారం రాత్రి మహబూబాబాద్ మార్కెట్ ఎదుట నిరసన తెలిపారు. మార్కెట్లోకి మిర్చి బస్తాలు తీసుకురావడానికి మూడు రోజులుగా ఇబ్బందిపడుతున్నామని, ఇప్పుడు మళ్లీ ట్రాక్టర్లో బస్తాలను తెస్తే అధికారులు వాహనాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసలే మార్కెట్లో కాంటాలు కాక రైతులు ఇబ్బంది పడుతుంటే మార్కెట్కు మాత్రం వరుసగా రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా సెలవులు ప్రకటించి గేట్లకు తాళాలు వేసి ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై మార్కెట్ కార్యదర్శి షంశీర్ను వివరణ కోరగా.. రెండు రోజులుగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి మిర్చి ఎక్కువ సంఖ్యలో వచ్చిందని, మార్కెట్లో షెడ్లు మొత్తం నిండిపోయినట్టు తెలిపారు. శుక్రవారం మార్కెట్కు సెలవు ఇవ్వడం వల్ల వాహనాలను లోనికి రానివ్వడం లేదని పేర్కొన్నారు.