మంథని రూరల్, సెప్టెంబర్ 14 : పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లిలో పిచ్చి కుక్కలు దాడి చేసి ఐదుగురిని గాయపరిచాయి. ఇందులో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్వర్ణపల్లి గ్రామానికి చెందిన నలుబోతుల మానసశ్రీ (5), కోరవేన వేదాన్ష్ (3) ఇండ్ల ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన రెండు పిచ్చి కుక్కలు వీరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు కుక్కలను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుండగా కర్రతో ఉన్న జిముడ రాజేశ్‌ను సైతం కరిచాయి.
గాయపడిన ఇద్దరు పిల్లలను మంథని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి వెళ్లిన కుక్క వెంకటాపూర్‌లోని గడ్డం మల్లేశ్ కూతురిని కరవగా అడ్డుకోబోయిన మల్లేశ్ మెడపై కరిచింది. పిచ్చి కుక్కలు ఇలా రోడ్లపై తిరుగుతూ కనబడిన వాళ్లందరినీ కరుచుకుంటూ వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.