ములుగురూరల్, అక్టోబర్ 7: విషజ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా పత్తిపల్లిలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన జాటోత్ కవిత-జయపాల్ దంపతులకు కొడుకు హర్షవర్ధన్ 4వ తరగతి, 1వ తరగతి చదువుతున్న కుమార్తె వర్షిత(8) ఉన్నారు. వారం నుంచి వర్షిత విషజ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఆదివారం వర్షిత కోమాలోకి వెళ్లడంతో మెరుగైన చికిత్స కోసం హనుమకొండకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని హనుమకొండలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది.
ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి
తాడ్వాయి, అక్టోబర్ 7: ఆర్ఎంపీ అందించిన వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగింది. జంపంగవాయికి చెందిన రత్నకుమారి (43) ఊరట్టం పోస్టాఫీస్‌లో ఏబీపీగా పనిచేస్తున్నది. 4 రోజుల క్రితం ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో నార్లాపురంలోని ఆర్ఎంపీని సంప్రదించి వైద్యం పొందింది. ఆదివారం మళ్లీ జ్వరంతో అదే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లగా ఇంజెక్షన్లు కలిపిన స్లైన్ ఎక్కించాడు. గంట తర్వాత ఆమె ఆరోగ్యం విషమించడంతో ము లుగు దవాఖానకు తీసుకువెళ్లాలని ఆర్ఎంపీ సూచించాడు. ములుగు, అక్కడి నుంచి వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో రత్నకుమారి మృతిచెందింది. ఆర్ఎంపీ రాజ్‌కుమార్ నిర్లక్షంమంతోనే తన తల్లి మృతి చెందిందని ఆమె కుమారుడు భాస్కర్ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.