హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జీవో ఎం.ఎస్. నం.175 ఆధారంగా పలు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం విచారణలో జాప్యం జరగకుండా చూడటం, తద్వారా తప్పుచేసిన వారిపై సకాలంలో చర్యలు తీసుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేరం లేదా అవకతవకలు జరిగిన వెంటనే సంబంధిత అధికారిపై అభియోగాలు నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ తర్వాత తీవ్రమైన లోపాలు ఉన్నట్టు తేలితే ఆలస్యం చేయకుండా చార్జెస్ వేయాలి. వాటిని స్పష్టమైన, సరైన పదాలతో, సాధారణ భాషలో రూపొందించాలి. విధుల్లో నిర్లక్ష్యం లేదా ప్రవర్తనా నియమాల ఉల్లంఘన వంటి సాధారణ పదాలను వాడకూడదు. ఆ అభియోగాలకు తగినంత డాక్యుమెంటరీ ఆధారాలు ఉండాలి. ఆరోపణలు ఎదురొంటున్న అధికారికి చార్జెస్‌తో పాటు, వాటికి సంబంధించిన పత్రాలు, సాక్షుల వాంగ్మూలాల నకళ్లను తప్పనిసరిగా అందించాలి.
కేసును సమర్థంగా విచారించడానికి ప్రెజెంటింగ్ ఆఫీసర్ అనే ఒక ముఖ్యమైన అధికారిని నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆ అధికారికి కేసు గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆయనకు అవసరమైన అన్ని రికార్డులు, పత్రాలు సకాలంలో అందించాలి. క్రమశిక్షణ అధికారులు విచారణ అధికారిని నియమించిన వెంటనే సంబంధిత రికార్డులన్నింటినీ వారికి పంపించాలి. రికార్డులను ముందుగా పరిశీలించకుండా నేరుగా హెచ్‌వోడీ నుంచి విచారణ అధికారికి పంపించకూడదు. కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో సహా సీనియర్ అధికారులు క్రమశిక్షణ కేసులపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలి. ఫైళ్లను కేవలం రొటీన్‌గా కాకుండా, వాటికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.
విచారణను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయని విచారణ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అలాగే, క్రమశిక్షణాధికారులు ఆరోపణలు ఎదురొంటున్న అధికారి పదవీ విరమణ తేదీని దృష్టిలో ఉంచుకొని సకాలంలో చర్యలు పూర్తి చేయాలి. ఈ నిబంధనను ఉద్దేశపూర్వకంగా విస్మరించిన వారిని ఆలస్యానికి బాధ్యులను చేస్తారు. క్రమశిక్షణ కేసుల ఫైళ్లను అధికారులు మూడు రోజులకు మించి తమ వద్ద ఉంచుకోకూడదు. మంత్రులకు పంపిన ఫైళ్లను వారంలోగా క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఆదేశాలను అన్ని సచివాలయ శాఖలు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలు క్రమశిక్షణ కేసుల పరిషారంలో జాప్యాన్ని నివారించి, పాలనలో పారదర్శకతను పెంచగలవని ప్రభుత్వం ఆశిస్తున్నది.