అచ్చంపేట : డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( DTF ) నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జక్కా రామస్వామి ( Secretary Ramaswamy ) మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదనని, నిజాయితీగా, న్యాయంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రాజ్యాంగ సూచన ప్రకారం రావలసిన ఐదు డీఏలు ( DA) , పీఆర్సీ ( PRC) , పెండింగ్ సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నామని అన్నారు.
ఉద్యోగుల వల్లనే రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నట్లుగా ముఖ్యమంత్రి దేశంలో ఏ సీఎం మాట్లాడని విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానిస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమ బాధ్యత, విద్యారంగా అభివృద్ధి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్, టీఎస్ జీఎల్ఐ అమౌంట్, రిటైర్మెంట్ ఫైనల్ బెనిఫిట్స్ దాదాపు 16 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు.
ముఖ్యమంత్రి ఉద్యోగులకు, ప్రజలకు హేయభావం వచ్చే విధంగా, విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడడం సముచితం కాదని సూచించారు. ఉద్యోగుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అప్పుల పాలు కాదని పాలకుల అనాలోచిత నిర్ణయాలు, అసమంజసమైన పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకొని ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశౠరు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి. గోవర్ధన్, జిల్లా బాధ్యులు ఐ యాదగిరిరావు , మోతిరాం , డీటీ నాయక్ , ఎన్ మోతీరామ్, శోభన్ బాబు, సుజాత, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.