ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 2 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెం పర్యటన విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేసింది. సీఎం అరగంట టూర్ కోసం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలు ఆరుగంటల పాటు పడిగాపులు పడాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంగళవారం డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి షెడ్యూల్ సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు సభా ప్రాంగణానికి సీఎం వస్తారని ప్రకటించి.. ఉదయం 11గంటల విద్యార్థులను, మహిళలను సభకు తరలించారు. అయితే సా యంత్రం 5గంటల అవుతున్నా సీఎం రాకపోవడంతో ఎదురుచూసి విసిగిపోయారు. సభ ప్రారంభం కాకపోవడంతో చాలామంది సభలోంచి వెనుదిరిగారు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. మరికొందరు వెళ్లిపోదామనుకున్నా కదలనివ్వకపోవడంతో ఆరు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. సీఎం పర్యటించే నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇల్లందు వంటి సు దూరం నుంచి విద్యార్థుల ను కొత్తగూడెం సభకు తరలించడమే గాక అధికారులు, నాయకులు మరుగుదొడ్లు, భోజన ఏర్పాట్లు కూడా చేయలేదని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాటలే తప్ప.. వరాలు ప్రకటించలే..
మూడు గంటలు ఆలస్యంగా వచ్చిన సీఎం కేవలం 40 నిమిషాలే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎలాంటి వరాలూ ప్రకటించలేదు. తమ ప్రభుత్వ హ యాంలో సీతారామ ప్రాజెక్టు ఇక పరుగులు తీస్తుందని చెప్పుకొచ్చిన సీఎం.. నిధుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నారని, వారు తలుచుకుంటే ఏమైనా అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఖనిజ సంపదపై పరిశోధనకు పరిశ్రమలు ఏర్పాటవుతున్న నేపథ్యంలోనే కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమయాభావం వల్ల మంత్రి వాకిటి శ్రీహరి సహా ఎవరూ సభా వేదికపై ప్రసంగించలేదు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు కూడా స్వల్ప సమయమే ఇవ్వడంతో సమస్యలు ప్రస్తావించే అవకాశమే లేకుండా పోయింది. చివరలో సీఎం మాట్లాడుతుండగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేజీ నుంచి దిగి వెళ్లిపోయారు. పంచాయతీ ఎ న్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలని క్వార్టర్‌కు, హాఫ్‌కు ఆశపడొద్దని సీఎం కోరారు. యూనివర్సిటీ ప్రారంభోత్సవ సభను సీఎం రాజకీయ సభగా మార్చేశారనే విమర్శలొచ్చాయి. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ఉదయం 5గంటలకే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సీఎం కొత్తగూడెంలో పర్యటించారని, ఇందిరమ్మ చీరలు కట్టుకొని సభకు రావాలని చెప్పడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని వారు ప్రశ్నించారు.