Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తన పరిపాలన అద్భుతంగా ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తన మంత్రులంతా సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రధానమంత్రితో భేటీలో కులగణపై చర్చ జరగలేదని వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో కులగణన చేసి.. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా.. చివరికి కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఇలాంటి కీలక అంశాన్ని ప్రధానితో భేటీ సమయంలో ప్రస్తావించకపోవడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గతం కన్నా బాగుందని ముఖ్యమంత్రి చెప్పారు. మిగతా రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రమే బెటర్‌గా ఉన్నదని అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఆయన నమ్మకం వ్యక్తం చేయలేదు. ఆ ఎన్నికల్లో గెలుస్తామనే అనుకుంటున్నాం అని అన్నారు. పీసీసీ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు పీసీసీ అధ్యక్షుడినే అడగాలంటూ సమాధానం దాటవేశారు. ఇక మంత్రివర్గ విస్తరణపై స్పందిస్తూ.. తాను ఎప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పలేదని అన్నారు. కొడంగల్ వ్యవహారాలు తన సోదరుడు చూసుకుంటాడని, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ఆయనను నియమించానని తెలిపారు. ఇక ప్రధానమంత్రికి తాను ఇవ్వాల్సిన విజ్ఞప్తులు ఇచ్చానని, వాటిని సాధించుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదేనని అన్నారు. ఇక ప్రధాన మంత్రికి తాను ఐదు ప్రాజెక్టులకు సంబంధించి వినతిపత్రం ఇవ్వగా.. ప్రధాని కూడా తనకు ఇక వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్(నిధులు)ను విడుదల చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.