విద్వేష ప్రసంగాలు ప్రాథమిక విలువలు,సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి.ఇది అత్యంత ప్రమాదకరం.. రావి నారాయణరెడ్డి అవార్డు ప్రదానోత్సవ సభలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చేసిన హితబోధ.
ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపితలమని వాళ్లే రాసుకుంటున్నారు. ఉద్యమకారులమని చెప్పుకొంటున్నారు. జాతిపిత అని చెప్పుకొంటున్నవాళ్లు ఏం చేశారు?– అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన విద్వేష వ్యాఖ్యలు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): సమయం, సందర్భం లేకుండా విమర్శలు చేసే వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చుకోవడం లేదు. ఉన్న చోటు, తన హోదా మరచిపోయి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను అడ్డగోలుగా విమర్శించడమే తన లక్ష్యమని మరోసారి చాటుకున్నారు. ఎవరు చెప్పినా, ఎంత హితబోధ చేసినా వినే స్థితిలో తాను లేనని నిరూపించుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవం’ నిర్వహించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. విద్వేష ప్రసంగాలు మంచివికాదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హితబోధ చేసిన కాసేపటికే.. మాజీ సీఎం కేసీఆర్‌పై, ఆయన చేసిన తెలంగాణ ఉద్యమంపై సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్‌రెడ్డి చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు.
విద్వేష ప్రసంగాలు ప్రమాదకరం
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్మారకోపాన్యాసం చేస్తూ.. ‘ఉద్రేకంతో కూడుకున్న ప్రసంగాలు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల్లో అంతర్భాగం కాదు. విద్వేష ప్రసంగాలు మన ప్రాథమిక విలువలను ధ్వంసం చేస్తాయి. సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి. ఇది అత్యంత ప్రమాదకరం. అంతేకాదు, విద్వేష ప్రసంగం మెజారిటీ ప్రజల దృష్టిలో ప్రసంగీకుని అస్తిత్వాన్ని, ఉనికిని ప్రమాదంలో పడేస్తుంది. నాకు ఉండే స్వేచ్ఛ, నేను ఎంచుకున్న వృత్తి, నాకు ఉండే ఆస్తిని కాపాడుకోవడంలో అందరి మాదిరిగానే నా హక్కులను కూడా ఉపయోగిస్తాను, ఇది నాకు రాజ్యాంగం ఇచ్చిన హామీ అనే భావన వారి నుంచి మాయమైపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం’ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ చేసిందేమిటి?
విద్వేష ప్రసంగంపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడిన కాసేపటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదంటూ విమర్శలు గుప్పించారు. సర్వం త్యాగం చేసినవారు జాతిపితలు, ఉద్యమనేతలు అవుతారని అన్నారు. ‘ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపితలమని వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు. ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకొంటున్నారు’ అని విమర్శించారు. ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ అనేక త్యాగాలు చేశారని, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని గుర్తుచేశారు. ‘ఇప్పుడు జాతిపిత అని చెప్పుకొంటున్నవాళ్లు ఏం చేశారు?’ అని ప్రశ్నించారు.
ఉద్యమంలో నువ్వెక్కడ?
రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కొండెక్కిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కాగడాగా మారారని, 14 ఏండ్లపాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమాన్ని నడిపించారని గుర్తుచేస్తున్నారు. చివరికి చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయించారని, ఇది త్యాగం కాదా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇంతచేసినా ‘ఏం చేశారు?’ అంటూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏమిటో రేవంత్వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పేరెత్తితే కాల్చిపారేస్తానంటూ ‘రైఫిల్‌రెడ్డి’ అవతారం ఎత్తి చేసిన హడావుడిని ఎవరు మరచిపోగలరని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అందరూ రాజీనామా చేస్తే, ఆనాడు రేవంత్‌రెడ్డి ఏం చేశారని నిలదీస్తున్నారు. ఏపీ టీడీపీ ఆఫీస్‌లో రాజీనామా లేఖ ఇచ్చి, డ్రా మాలు ఆడింది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇక.. రేవంత్ ప్రొ. కోదండరాంకు అన్యాయం జరిగినట్టు మాట్లాడటంపై విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక వివాదం సుప్రీంకోర్టులో ఉన్నదని తెలిసి కూడా ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్టు నాటకం ఆడి, ఆయనను మోసం చేస్తున్నదెవరని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని త్రిశంకు స్వర్గంలో చూపెట్టడం కోదండరాంకు తమరు చేస్తున్న అవమానం కాదా? అని తెలంగాణవాదులు నిలదీస్తున్నారు.
హార్వర్డ్‌లో చదివినా హేట్ స్పీచే:హరీశ్‌రావు
అమెరికాలోని హార్వర్డ్‌కు వెళ్లి నాలుగు రోజులు చదువుకున్నా సీఎం రేవంత్‌రెడ్డి గుణం మారలేదని, కనీస సంస్కారం రాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. తాజాగా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై కుసంస్కారంతో చేసిన చిల్లర వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం రావి నారాయణరెడ్డి పురస్కార ప్రదానోత్సవ వేదికపై నుంచి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టారు. హేట్ స్పీచ్‌పై ఆ సభలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హితబోధ చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అదే వేదికపై రేవంత్‌రెడ్డి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని దెప్పిపొడిచారు. కడుపులో కత్తులు.. నోట్లో విషం పెట్టుకున్న రేవంత్‌రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే రేవంత్‌రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని ఎద్దేవా చేశారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పేందుకు పుస్తకాలు చదువాల్సిన అవసరం లేదని, ఇంటర్నెట్లో శోధించాల్సిన పనిలేదని మన ముఖ్యమంత్రి ప్రసంగాలు వింటే చాలని చురకలంటించారు. విద్వేష రాజకీయాలు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి రేవంత్ నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు.
కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపితనే
స్వాతంత్య్ర సంగ్రామంలో ముందుండి పోరాడిన గాంధీజీ దేశానికి జాతిపిత అయినట్టే.. ఆయన చూపిన శాంతిమార్గంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ కూడా తెలంగాణ జాతిపితనే అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున సాగిన సమయంలో ఆంధ్రా నాయకుల బూట్లు తుడిచిన నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది? ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కెక్కడిది? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే అరెస్ట్‌లు, అక్రమ కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష కోసం వినియోగిస్తున్న రేవంత్‌రెడ్డి.. అధికార దుర్వినియోగం గురించి లెక్చర్లు ఇవ్వడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు.