హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. శనివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీడబ్ల్యూసీ సభ్యుడు, మంత్రి దామోదర రాజనరసింహ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి కూడా ఉన్నారు. కొత్త ఎంపీలకు సైతం ఆహ్వానం అందింది. వీరికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం ఇది 14వ సారి కావడం గమనార్హం. ప్రస్తుతం సీఎం, టీపీసీసీ అధ్యక్ష పదవుల్లో రేవంత్‌రెడ్డే ఉన్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికలో సామాజిక సమీకరణలను పార్టీ పెద్దలకు రేవంత్‌రెడ్డి వివరించనున్నారని సమాచారం. సీఎం పోస్టు అగ్రవర్ణాలకు, డిప్యూటీ సీఎం, స్పీకర్ పోస్టు ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వడంతో టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు నేతల ద్వారా తెలిసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ రేసులో ఉన్నట్టు సమాచారం. వీరు ముగ్గురు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా అధిష్ఠానం మరో సామాజిక వర్గానికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మైనార్టీ వర్గానికి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణపై చర్చకు అవకాశం
ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ గెలువగా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా? అన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇప్పటిదాకా మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తనకు అవకావం కల్పిస్తారని నాంపల్లి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఫిరోజ్‌ఖాన్ గంపెడాశతో ఉన్నారు. ఇక భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే తనకు మంత్రి పదవి వస్తుందని మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉండటంతో ఒకే కుటుంబానికి రెండో మంత్రి పదవి ఇవ్వడం కష్టమని పార్టీ వర్గాల్లో చర్చనడుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి సైతం మంత్రి పదవి ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైన నేపథ్యంలో శ్రీహరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? అన్నది అనుమానమే!. ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు 37 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినట్టు ప్రకటించారు. కోడ్ రావడంతో ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పటికే ప్రకటించినవాటితో పాటు మరో 13 పోస్టుల భర్తీకి ఆధిష్ఠానం నుంచి అనుమతి పొందనున్నారని సమాచారం.