CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మాట మార్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం మ్యానిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, ఇప్పుడు దాన్ని రూ.12 వేలకే పరిమితం చేసి అన్నదాతలను దగా చేసి తాజాగా పథకం అమలు సమయంలో కూడా మరో సారి రైతన్నల ఉద్వేగాలతో ఆడుకుంటున్నారు. తొలుత జనవరి 26న రాత్రి నుంచే ప్రతి రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ వేదిక మీద ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అదే వేదిక మీద కొద్ది సేపటికే నాలుక మడతేశారు.
రైతు భరోసా నిధులు మార్చి31 లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించటంతో రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం చంద్రవంచలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. నాలుగు పథకాలను ప్రారంభించిన సీఎం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున ఇస్తున్నం. ఇవాళ బ్యాంకులకు సెలవు కాబట్టి, రైతు భరోసా డబ్బులు జమ కావు. అర్ధరాత్రి 12 దాటగానే ప్రతి ఎకరాకు రూ.6 వేల చొప్పున మీ ఖాతాల్లో, నగదు టకీటకీమని పడేలా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నం’ అని ఆర్భాటంగా ప్రకటించారు.
సంతోషం కొద్ది సేపు కూడా లేకుండా
సీఎం ప్రకటనకు మద్దతుగా చప్పట్లు కొట్టారు. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కూ మధ్య ఉందన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ను ఇచ్చే పథకాన్ని మొదట అమలు చేసింది, దేశమంతటా రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రసంగిస్తూ సరిగ్గా 17వ నిమిషంలో రేవంత్‌రెడ్డి మళ్లీ రైతు భరోసా ప్రస్తావన తెచ్చారు. ‘రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద దాదాపు మార్చి 31 తారీఖు లోపల రూ.10 వేల కోట్లు పేద రైతుల ఖాతాల్లో వేసి, రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది’ అనటంతో రైతులంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి రెండు నాల్కల ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదినుంచీ మోసమే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ రూ.2 లక్షల చొప్పున చేస్తమని, రైతుబంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తమని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైతు భరోసానైనా సక్రమంగా ఇస్తారేమో అని అన్నదాతలు ఎదురు చూశారు. సాకులు చెప్పి గత వానకాలం పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ముందుగా రూ.15వేలు అని చెప్పి ఇప్పుడు రూ.12 వేలు చేసిన రైతు భరోసాను చెప్పినట్టే 26న రాత్రి నుంచే ఖాతాల్లో వేస్తారనుకుంటే, ఆ సంతోషం కొద్దిసేపు కూడా ఉండనీయకుండా మార్చి 31 వరకు ఇస్తామని చెప్పటంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ తమను మోసం చేస్తూ వస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.