నిర్మల్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు తన సొంత జిల్లా పాలమూరుతో సమానంగా నిధులు ఇచ్చి, అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్‌లో పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతిబాట’ బహిరంగ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మించిన సదర్మాట్ బరాజ్‌ను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో నిర్మించిన చనాక-కొరాట పంప్‌హౌస్‌ను ప్రారంభించి, ప్రాధాన కాలువకు నీటిని విడుదల చేశారు.
ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. త్వరలోనే బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సాగునీరు అందాలంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని, 10వేల ఎకరాల భూములు సేకరించి అతిపెద్ద పారిశ్రామికవాడ ఏర్పాటుచేస్తామని చెప్పారు. చనాక-కొరాట ప్రాజెక్టుకు సీ రాంచంద్రారెడ్డి పేరు, సదర్మాట్ ప్రాజెక్టుకు పీ నర్సారెడ్డి పేరును పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు దండె విఠల్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.