Nominated Posts | హైదరాబాద్: నామినేటెడ్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. ఇందులో భాగంగానే గతంలో ఎవరెవరికి హామీ ఇచ్చాము, ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుందో జాబితా సిద్ధం చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ(పీఏసీ)లో నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యీ స్థానాలపై సమావేశంలో రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. 10 ఏండ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అధికారానికి దూరంగా ఉన్నారని, తద్వారా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారని అన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోస్టుల భర్తీ ఆలస్యం చేయడం మంచిది కాదని అన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావ్ ఠాక్రే, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.