హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసింది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం మొత్తం దేశ, విదేశీ పర్యటనల్లో మునిగితేలింది. ప్రజలు, రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నామని కాంగ్రెస్ పాలకులు చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని తాజా ఘటనతో తేలిపోయింది. రాష్ట్రంలో ఒక్క మంత్రి కూడా లేకపోవడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మిగతా మంత్రులు మంగళవారం ఉదయమే కర్ణాటక బాటపట్టారు. బెళగావిలో కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో వారు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులు, నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యతగా ఒక్క మంత్రి కూడా రాష్ట్రంలో ఉండకపోవడం ఏమిటని మండిపడుతున్నారు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్రామ సభలు జరుగుతున్నాయి. అధికారులు, నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయా శాఖల మంత్రులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడం, ఎక్కడైనా ఘర్షణ పరిస్థితులు ఏర్పడితే తగిన నిర్ణయాలు తీసుకొని, అధికారులకు మార్గనిర్దేశం చేయడం వంటివి పనులు చక్కబెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై మండిపడుతున్నారు. మరోవైపు పాలకవర్గం మొత్తం దేశ, విదేశీ పర్యటనలకు వెళ్లిపోవడంతో.. అధికారులు సైతం లైట్ తీసుకున్నారు. సచివాలయంలోని అనేక కార్యాలయాలు అధికారులు లేక బోసిపోయి కనిపించాయి. దీంతో ‘ఇదేనా ప్రజాపాలన? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత?’ అని ప్రజలు విమర్శిస్తున్నారు.