ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నది. అప్పు పుడుతలేదు. రూ.6,500 కోట్లు జీతాలు, పెన్షన్లకు పోతున్నయి. రూ.13 వేల కోట్ల ఖర్చులు పోగా.. రూ.5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నయి. ఇందులో రైతు రుణమాఫీ ఏం చేయాలె? రైతుభరోసా ఏమివ్వాలి? ఆర్టీసీ బస్సులకు ఏమివ్వాలె? పెండింగ్ ప్రాజెక్టులను ఎట్ల కట్టాలె? ఉన్నదే ఐదువేల కోట్లు. వాటి మీదనే సాము చేస్తున్నము. నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నం. ఏం చేయాల్నో నాకు తోస్తలేదు. నన్నేం చేయమంటరో మీరే చెప్పండి.
మనకు వస్తున్న రూ.18,500 కోట్లను దేనికి ఖర్చు పెట్టాల్నో చెప్పండి. ఉద్యోగుల జీతాలు అపాల్నా? రైతుభరోసా అపాల్నా? షాదీముబారక్, కల్యాణలక్ష్మి ఆపాల్నా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాల్నా? మీరే చెప్పండి. ఏది ఆపి ఏదియ్యాలె? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాల్నా? ఏమాపాలె?
వాళ్లనే (ఆర్ కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ) కమిటీ వేయమనండి. వాళ్ల చేతికే చిట్టా అప్పగిస్త. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్లనే వేయమనండి. మొత్తం ఆదాయం వాళ్లకు అప్పగిస్తం. గల్లా పెట్టే దగ్గర వాళ్లనే కూర్చోబెడుతం. వచ్చే ఆదాయంలో ఎవరికి ఎలా పంచుతారో పంచండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలె. లెక్కలన్నీ మీ దగ్గరనే ఉన్నయి.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ‘ఎక్కడా అప్పు పుడుతలేదు, బజార్లో ఎవరూ మనల్ని నమ్మడంలేదు. మీరు నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేస్తరయా నన్ను… కోసుకుని తింటరా’ అంటూ అర్నెళ్ల క్రితం ఉద్యోగుల సమావేశంలో అప్పులు, ఆదాయంపై సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలివి. కాంట్రాక్టర్లు బిల్లులడిగినా, ఉద్యోగులు బకాయిలు అడిగినా, కాలేజీలు ఫీజు బకాయిలు అడిగినా ఇలా ఎవరు బకాయిలు అడిగినా సరే సీఎం రేవంత్రెడ్డి ఠక్కున ఆదాయం, అప్పుల గురించి చెప్పి చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. సీఎం స్థానంలో ఉన్నా అనే విషయం మర్చిపోయి, తనకు అలవాటైన బీద అరుపులు అరవడమే అలవాటుగా మార్చుకున్నారు. విమర్శలు వచ్చినా తీరు మార్చుకోవడంలేదు. తాజాగా మరోసారి దివాలా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగే పరిస్థితే లేదని, ఏం చేయాలో తోచడం లేదని బేల మాటలు మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన నిస్సహాయ, నిర్వేద వ్యాఖ్యలు చేశా రు. రాష్ట్ర అప్పులు, ఆదాయంపై మరోసారి లెక్కల చిట్టా తీశారు.
విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేవంటూ లెక్కలను చెప్పుకొచ్చారు. ‘ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నది. రూ.6500 కోట్లు జీతాలు, పెన్షన్లకు పోతున్నది. రూ.13 వేల కోట్ల ఖర్చులు పోగా.. రూ.5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నది. ఇందులో రైతు రుణమాఫీ ఏం చేయాలి? రైతుభరోసా ఏమివ్వాలి? ఆర్టీసీ బస్సు ఏమివ్వాలి? షాదీముబారక్ ఏమివ్వాలి? కల్యాణలక్ష్మి ఏమివ్వాలి? పెండింగ్ ప్రాజెక్టులను ఏమి కట్టాలి? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమివ్వాలి? పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఏమివ్వాలి? సీఎం రిలీఫ్ ఫండ్ ఏమివ్వాలి? ఉన్నదే ఐదువేల కోట్లు. దాని మీదనే సాము చేస్తున్నము. నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నం. ఏం చేయాలో నాకు తోచడంలేదు. నన్నేం చేయమంటరో మీరే చెప్పండి’ అంటూ రుసరుసలాడారు.
సీఎం రేవంత్రెడ్డి పరిపాలన బాధ్యతలు తనపైనే ఉన్నాయనే విషయం మర్చిపోయినట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగను ఉద్దేశించి ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడారు. ఉన్న ఆదాయంతో పాలన సాగడంలేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు సాగడంలేదని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడమే గగనమైపోతున్నదని చేతులెత్తేశారు. ‘వాళ్లనే కమిటీ వేయమనండి. వాళ్ల చేతికే చిట్టా అప్పగిస్తా. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్లనే వేయమనండి. మొత్తం ఆదాయం వాళ్లకు అప్పగిస్తం. గల్ల పెట్టే దగ్గర వాళ్లనే కూర్చోబెడుతాం. కాలేజీలు, మేనేజ్మెంట్లు, చదువు చెప్పేటోళ్లు వాళ్లకు తెలిసినోళ్లే కదా. వాళ్ల వెనుకాల ఉన్నోళ్లు, వాళ్లు కూర్చొని, మనకు వస్తున్న రూ.18వేల కోట్లు, రూ.18వేల ఐదు వందల కోట్లను దేనికి, దేనికి ఖర్చు పెట్టాల్నో చెప్పం డి. జీతాలు ఆపాల్నా. రైతుభరోసా ఆపాల్నా, షాదీముబారక్, కల్యాణలక్ష్మి ఆపాల్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాల్నా… మీరే చెప్పండి. ఏది ఆపితే ఏది ఇయ్యాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాల్నా… ఏమాపాలె? అంటూ ఎదురు అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మరోసారి అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగులకే పోతున్నదన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆపడం కోసం ఏం చేయాలో చెప్పాలంటూ విలేఖరులను, పరోక్షంగా కాలేజీల యాజమాన్యాలను, అధికారులను ఉద్దేశించి మండిపడ్డారు. ‘ప్రభుత్వ ఉ ద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆ పుదాం. ఆరువేల కోట్లు వస్తే.. వీళ్ల పైసలు(రీయింబర్స్మెంట్ బకాయిలు) మొత్తం ఇచ్చే ద్దాం. అర్థం పర్థం ఉండాలె. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలె. లెక్కలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. నా ఇంట్లో ఏమీ లేవు’ అంటూ చేతులెత్తేశారు.
సర్కారును నడపం, ఆర్థిక సమతుల్యం చేయడం తనతో కావడం లేదని సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారు. ఆదాయం పెంచి సంక్షేమానికి పంచడం వీలయితలేదని చేతులెత్తేశా రు. చార్జీలు పెంచుతామంటే ప్రతిపక్ష పార్టీ అ డ్డుకుంటున్నదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ‘సర్కారు గల్ల పెట్టే మీకే అప్పగిస్తా.. వచ్చే ఆదాయంలో ఎవరికి ఎలా పంచుతారో పంచండి’ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, ఎంపీ ఆర్ క్రిష్ణయ్య, మందకృష్ణ మాదిగను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.