హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేటీఆర్, హరీశ్‌రావు తమ మీద విమర్శలు కాదు.. దండయాత్ర చేస్తున్నా.. బడా నేతలంతా మాకెందుకులే, మమ్మల్ని కాదు కదా అన్నట్టు సైలెంట్‌గా ఉంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వాపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘నా కంటే మీకు మంచి సీఎం దొరకడు’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ వేడుకల సమీక్షల అనంతరం సీఎం కొంతమంది మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి కొద్దిసేపు మాట్లాడినట్టు తెలిసింది. ఢిల్లీ టూర్, మహారాష్ట్ర ఎ న్నికల ప్రచార అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. అనంతరం లగచర్ల ఘటన, కుల గణన, సోషల్ మీడియా ప్రస్తావనకు రాగా.. తెలంగాణలో రాబోయే కుల గణన ఫలితాల మీద రాహుల్‌గాంధీ చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్తూ.. ‘మనం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇటు పార్టీపరంగా గానీ, అటు సోషల్ మీడియా పరంగా గానీ దీటుగా ఎదుర్కోలేకపోతున్నాం’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేవలం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అప్పుడప్పుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ తప్ప మిగతా మం త్రులు ఎవరూ మాట్లాడటం లేదని, ఎంపీలు, ఎమ్మెల్యేలు అసలే స్పందించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో నష్టం తప్పదు
కేటీఆర్, హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని, వాటిని కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నమే చేయటంలేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసినా.. రైతుల నుంచి ఆశించిన స్థాయిలో మైలేజీ రాలేదని పేర్కొన్నారు. పార్టీ నాయకు లు మౌనంగా ఉన్నారని, ప్రతిపక్షాల అరోపణలు, విమర్శలను సమర్థంగా ఎదుర్కొని కౌంటర్ ఇవ్వడం లేదని ఘాటుగానే మాట్లాడినట్టు తెలిసింది. వారి మౌనానికి కారణం ఏమిటని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అడిగినట్టు సమాచారం. ఇది ఇట్లానే కొనసాగితే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు లోకల్‌బాడీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించినట్టు సమాచారం.